న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’పై కేంద్ర హోం శాఖ బుధవారం కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది.ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో నేషనల్ ఆంథమ్ ‘జనగణమన’కు ముందు ‘వందే మాతరం’ గేయం పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం ప్లే అవుతున్నప్పుడు నిలబడటం తప్పనిసరి చేసింది. సినిమా హాళ్లలాంటి బహిరంగ ప్రదేశాల్లో మాత్రం నిలబడటం తప్పనిసరి కాదని పేర్కొంది.
కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. 'వందేమాతరం'ను జాతీయ జెండా ఎగరవేసే టైంలో.. అలాగే, రాష్ట్రపతి లేదా గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాల్లో, పద్మ అవార్డులు వంటి పౌర పురస్కారాల వేడుకల్లో, రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాల ముందు, అన్ని పాఠశాల్లో ఉదయం అసెంబ్లీ టైంలో తప్పనిసరిగా ఆలపించాలి. పూర్తి ఆరు చరణాలను 3 నిమిషాల 10 సెకన్లలో పాడాలి.
ప్రస్తుతం మొదటి రెండు చరణాలు మాత్రమే అధికారికంగా ఆలపిస్తున్నారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన 'వందేమాతరం' గేయానికి 150 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ గేయానికి మరింత గౌరవం ఇవ్వడానికి ఈ నియమాలు అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 'జనగణమన'కు మాత్రమే స్పష్టమైన ప్రోటోకాల్ ఉండేది. ఇప్పుడు 'వందేమాతరం'కు కూడా సమానమైన ఆదేశాలు వచ్చాయి.
ఇకపై ఎవరైనా 'వందేమాతరం' గేయాన్ని అవమానించడం, దాని గౌరవాన్ని భంగపరచడం, ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, భంగం కలిగిస్తే గరిష్టంగా 3 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
