ప్రతీ రైతు కష్టాన్ని తీర్చేందుకు కృషి: ప్రధాని మోదీ

ప్రతీ రైతు కష్టాన్ని తీర్చేందుకు కృషి: ప్రధాని మోదీ

 

  • వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ 50 రోజుల్లో 11 కోట్ల మందితో కనెక్ట్​ అయింది
  • లబ్ధిదారుల ఇంటి వద్దకే మోదీ గ్యారంటీల గాడి వస్తున్నది
  • వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం

న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువతకు సాధికారత లభించినప్పుడే దేశం శక్తిమంతం అవుతుందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఇండియాలో ఈ నాలుగు వర్గాలే అతి పెద్ద కులాలని ఆయన పేర్కొన్నారు. ‘వికసిత్‌‌ భారత్‌‌ సంకల్ప్‌‌ యాత్ర’ కార్యక్రమానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వికసిత్ భారత్ కేవలం ప్రభుత్వానికి చెందిన ప్రోగ్రామ్ లా కాకుండా దేశానికి సంబంధించిన యాత్రగా మారిందని అన్నారు.

రైతులకు ‘బూస్ట్’ ఇచ్చాం

గత ప్రభుత్వాలు వ్యవసాయ విధానంపై చర్చలకే పరిమితమయ్యాయని మోదీ విమర్శించారు. రైతులు నిత్యం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను అవి విస్మరించాయన్నారు. తమ ప్రభుత్వం రైతుల ప్రతీ కష్టాన్ని తీర్చేందుకు కృషి చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు కనీసం రూ.30,000 ఇస్తున్నామని చెప్పారు. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ(పీఏసీఎస్​), ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్​పీవో) వంటి సంస్థలతో సాగులో సహకారాన్ని పెంపొందించామని పేర్కొన్నారు. గోదాములు, నిల్వ సౌలతుల పెంపు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా రైతులకు ‘బూస్ట్’ ఇచ్చామన్నారు. 

రెండు కోట్ల మందికి హెల్త్ టెస్ట్​లు

ఒక మిషన్ మోడ్‌‌లో ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ పథకాలు అందించడమే ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ ప్రధాన లక్ష్యం మోదీ అన్నారు. 50 రోజుల్లో ఈ యాత్ర దాదాపు 11 కోట్ల మందితో కనెక్ట్ అయిందని తెలిపారు.  యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉజ్వల కనెక్షన్‌‌ల కోసం 12 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చాయని, సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి యోజన, పీఎం ఎస్వీనిధికి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని మోదీ తెలిపారు. అలాగే కోటి టీబీ చెకప్‌‌లు, 22 లక్షల సికిల్ సెల్ చెకప్‌‌లతో సహా ఇప్పటివరకు రెండు కోట్ల మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని అన్నారు.  దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఆయుష్మాన్ ఆరోగ్య కేద్రాలు గ్రామాలకు, పేదలకు భారీ ఆరోగ్య కేంద్రాలుగా మారాయని చెప్పారు.

మహిళా సంఘాలకు 7.5 లక్షల కోట్ల నిధులిచ్చాం

ఈ పదేండ్లలో 10 కోట్ల మంది ఆడపడుచు లు మహిళా స్వయం సహాయక సంఘాల లో చేరారని, వారికి రూ.7.5 లక్షల కోట్లకు పైగా నిధులు అందించామని మోదీ తెలిపారు. దీని వల్ల చాలా మంది సోదరీమణులు ‘లక్​పతి దీదీ’గా మారారని పేర్కొన్నారు. ఈ ‘లక్​పతి దీదీ’ల సంఖ్యను రెండు కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.