- ప్రతిపాదనను మళ్లీ పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే సంస్థగా విలీనం చేసే పాత ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ పరిశీలిస్తోంది. ఈ కంపెనీల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో, వీటి బిజినెస్‌ను విస్తరించేందుకు విలీనమే బెటర్ అని భావిస్తోంది. 2019–20 నుంచి 2021–22 మధ్య ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లలో రూ.17,450 కోట్లను ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది. వీటిని ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేసేందుకు చర్యలు తీసుకుంది. 2018–19 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మూడు సంస్థలను విలీనం చేస్తామని ప్రకటించారు. అయితే 2020 జులైలో ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ రూ.12,450 కోట్ల మూలధనాన్ని ఈ సంస్థలకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పుడు ఈ మూడు ఇన్సూరెన్స్ కంపెనీల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో, మంత్రిత్వ శాఖ విలీనంపై ప్రాథమిక అంచనాలు వేస్తోంది. అదనంగా, ఒక జనరల్ ఇన్సూరెన్స్ సంస్థను ప్రైవేటీకరించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది.
2021–22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఒక ఇన్సూరెన్స్ సంస్థను ప్రైవేటీకరించే ప్లాన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనైలేజేషన్) సవరణ చట్టం, 2021ని పార్లమెంట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం కనీసం 51శాతం వాటా కలిగి ఉండాల్సిన అవసరాన్ని తొలగించింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు మార్గం సులభమైంది. ఇక, విదేశీ పెట్టుబడిదారుల ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు, ఇన్సూరెన్స్ రంగంలో ఫారిన్ డైరెక్ట్ లిమిట్ పరిమితిని 74శాతం నుంచి 100శాతానికి పెంచే బిల్లును రాబోయే శీతాకాల సమావేశంలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరుగుతాయి.
