- 18 నుంచి 5 శాతానికి తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వెల్లడి
- జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది
- ఇలాంటి మినహాయింపులు ఇస్తే.. మరిన్ని డిమాండ్లు వస్తయ్
- ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వ్యాఖ్య
- ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై కోర్టు ఆందోళన
- నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బందేంటని ప్రశ్న
- కేంద్రానికి 10 రోజుల గడువు.. వచ్చే నెల 9కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్‌టీ తగ్గించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. లగ్జరీ ఐటమ్‌గా ఉన్న ఎయిర్‌ప్యూరిఫయర్లపై జీఎస్టీని ఇప్పటికిప్పుడు 18 నుంచి 5 శాతానికి తగ్గించడం సాధ్యంకాదని ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫయర్లపై ప్రస్తుతం విధించిన 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ హాజరై, వాదనలు వినిపించారు. జీఎస్‌టీ రేట్లను తగ్గించడం అనేది కేవలం ఒక పిటిషన్ ద్వారా జరగదని, దీనికి జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఎయిర్ ప్యూరిఫయర్లను ‘వైద్య పరికరాలు’గా గుర్తించి 5% పన్ను పరిధిలోకి తేవడం అనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. ఒకవేళ ఇలాంటి మినహాయింపులు ఇస్తూ పోతే అది మరిన్ని డిమాండ్లకు దారితీస్తుందని, ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వాదించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అంగీకారం అవసరమని, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు.. ఇలాంటి కోర్టు ఆదేశాలు రాజ్యాంగబద్ధమైన విభజన అధికారాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. పిటిషనర్ తన వ్యాజ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖను ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ పిటిషన్ ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారో తెలియట్లేదని.. పిటిషనర్ ఉద్దేశం గురించి తెలుసుకోవడానికి అనేక విషయాలపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
కేంద్రంపై కోర్టు ఆగ్రహం..
కేంద్రంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ నేతృత్వంలోని బెంచ్ ఇటీవల తీవ్రంగా స్పందించింది.‘‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించండి లేదా ఎయిర్ ప్యూరిఫయర్‌లపై పన్ను తగ్గించండి”.. ఈ రెండే ఆప్షన్లు ప్రభుత్వం ముందున్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించడం అనేది ప్రభుత్వం చేయాల్సిన అత్యవసర పని అని కోర్టు వ్యాఖ్యానించింది. రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉండే వీటి ధరలు సామాన్యులకు భారం కాకూడదని, పన్ను తగ్గిస్తే పేదలకు కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడింది. దీనిపై నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బందేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, పన్ను తగ్గింపు అంశంపై చర్చించాలంటే జీఎస్టీ కౌన్సిల్ వ్యక్తిగతంగా సమావేశమవ్వాలని.. వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ వెంకటరామన్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో వివరణాత్మక స్పందన సమర్పించేందుకు కేంద్రానికి కోర్టు 10 రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.
