రాజకీయాల్లో అధికారం మారడం సహజం. నాయకులు మారడం కూడా సహజమే. కానీ తన సిద్ధాంతాలను, విలువలను, ప్రజలకు ఇచ్చిన మాటలను హామీలను వదిలిపెడితే అది కేవలం పార్టీ సంక్షోభం కాదు, ప్రజాస్వామ్య సంక్షోభం. దేశ రాజకీయాలను చూస్తే నేడు సిద్ధాంతాల స్థానంలో అవకాశవాదం, ప్రజా ప్రయోజనాల స్థానంలో వ్యక్తిగత ప్రయోజనాలు, ఉద్యమాల స్థానంలో ఎన్నికల గణితమే ప్రధానంగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో విలువలకు కట్టుబడి నిలిచే రాజకీయ శక్తులు క్రమంగా బలహీనపడితే నష్టపోయేది కేవలం ఒక పార్టీ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థే. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమైన రాజకీయ ప్రయాణం, వ్యవస్థను మార్చాలనే ఆశతో కోట్లాది యువతను ఆకర్షించింది.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఉద్యమం అధికార రాజకీయాల బాట పట్టినప్పుడు ప్రజల్లో నిరాశ పెరిగింది. వ్యక్తులపై ఆధారపడిన రాజకీయాలు ఎంత వేగంగా ఎదుగుతాయో, అంతే వేగంగా కూలిపోతాయని చరిత్ర చెబుతోంది.రాజకీయాల్లో గెలుపు కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టడం మొదలైతే, ప్రజలు రాజకీయాలపై విశ్వాసాన్ని కోల్పోతారు. ఆ శూన్యాన్ని ధనబలం, మతం, కులం, ప్రచార యంత్రాంగం నింపేస్తాయి. అప్పుడు ఎన్నికలు జరుగుతాయి కానీ ప్రజాస్వామ్యం బలపడదు.
ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ద్రవ్యోల్బణం
ప్రస్తుతం దేశంలో రెండు జాతీయ పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నప్పటికీ, ప్రజా సమస్యలపై మాత్రం ఒకే విధమైన మౌనం పాటిస్తున్నాయనే విమర్శ బలపడుతోంది. నిరుద్యోగం, పరీక్షల లీకులు, రైతుల సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నా, రాజకీయ చర్చ మాత్రం వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదకర పరిణామం. ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన సమయంలో, రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలతో అసలు సమస్యలను పక్కన పెడితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.
చరిత్రలో గొప్ప ఉద్యమాలు వ్యక్తుల వల్ల కాదు.. ప్రజల ఆకాంక్షల వలన నిలిచాయి. తెలంగాణ ఉద్యమం కూడా వ్యక్తుల కంటే స్వయంపాలన, ఆత్మగౌరవం అనే సిద్ధాంతం వల్ల విజయవంతమైంది. భారత స్వాతంత్ర్య ఉద్యమం కూడా అధికార దాహం వల్ల కాదు.. పరాయి పాలన విముక్తి కోసం, విలువల కోసం సాగింది. సిద్ధాంతాలను వదిలి అధికారాన్ని ఎంచుకున్న పార్టీలు తాత్కాలిక విజయాలు సాధించవచ్చు.
కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించలేవు. సిద్ధాంతం లేని రాజకీయాలు శరీరం లేని ఆత్మ లాంటివి. అలాంటి రాజకీయాలు కొంతకాలం నడుస్తాయి, కానీ దేశ భవిష్యత్తును నిర్మించలేవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది బలమైన ప్రతిపక్షం మాత్రమే కాదు, బలమైన విలువలు.
దిగొచ్చిన కేంద్రం, వేగంగా చర్యలు
ఎన్టీఏ ఉద్యోగులపై చర్యలు, పరీక్ష నిర్వహణలో మార్పులు, ప్రశ్న పత్రాలు లీకేజీ జరిగితే దోషులకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లాంటి వాటిని అమలు చేయాలని నిర్ణయించారు. కానీ లీకేజీ
వ్యవహారంలో నష్ట పోయిన విద్యార్థులకు, మానసిక వ్యధతో వ్యవస్థ చేసిన దుర్మార్గానికి బలి అయిన విద్యార్థులకు ఎలాంటి భరోసా ఇస్తారో చూడాలి. మొత్తం మీద ఇంతకాలం బెట్టుచేసిన కేంద్రం, విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు.
పారదర్శకత అడిగితే.. దేశ ద్రోహ నిందలా?
విద్యార్థుల ఉద్యమాన్ని కొందరు అధికార పార్టీ నేతలు దేశ వ్యతిరేక చర్యగా, ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించడం. ఒక విద్యార్థి తన పరీక్ష న్యాయంగా జరగాలని కోరితే అతను దేశద్రోహి ఎలా అవుతాడు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అతను రాజకీయ కార్యకర్త ఎలా అవుతాడు? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ బాధ్యత తప్పును సరిదిద్దడం. కానీ నేడు జరుగుతున్నది
బాధ్యతను తప్పించుకోవడం, విమర్శలను వ్యక్తులపై మళ్లించడం, ప్రశ్నించే వారిపైనే రాజకీయ దాడులు చేయడం. ఇది ప్రజాస్వామ్య ఆరోగ్యానికి శుభపరిణామం కాదు. నీట్ వ్యవహారం ఒక పరీక్ష సమస్య మాత్రమే కాదు.. దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశం. పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకపోతే ప్రతిభపై విశ్వాసం దెబ్బతింటుంది. పుష్కర కాలంగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం
భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న శక్తులను సహించలేకపోతున్నది. ఫలితంగానే పరిష్కారాలు దొరకనపుడు విద్యార్థి ఉద్యమాలు తప్పడం లేదు.
కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేలేకపోయింది
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తన వయసు 80 దాటినా చూపిన చైతన్యం హర్షించదగ్గ విషయమే. కానీ కాంగ్రెస్ పార్టీ గత రెండు నెలలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి కావు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది . కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటాలపై ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజాపక్షం, అధికారంలో ఉంటే ప్రజా వ్యతిరేకం అనే భావన ప్రజల్లో ఏర్పడింది. దీనిని అన్ని రాజకీయ పార్టీలు గమనించి ప్రవర్తిస్తే మంచిది. లేకపోతే ప్రజలే న్యాయ నిర్ణేతలని మరిచిపోవద్దు.
పారదర్శకతపైనే అనుమానాలు
దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన విద్యార్థులను నేడు రాజకీయాల బలిపీఠంపై నిలబెట్టడం అత్యంత దురదృష్టకరం. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, పారదర్శకతపై తలెత్తిన అనుమానాలు ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని బహిర్గతం చేశాయి. కానీ ఆ తప్పులను సరిదిద్దే బదులు, ప్రశ్నించిన విద్యార్థులనే రాజకీయ ప్రేరేపితులుగా ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
విద్యార్థులు వీధుల్లోకి రావడానికి కారణం రాజకీయ పార్టీలు కాదు. తమ శ్రమ, తమ భవిష్యత్తు, తమ కలలు ప్రమాదంలో పడ్డాయనే ఆవేదనే వారిని పోరాటానికి నడిపించింది. పరీక్షలో న్యాయం జరగాలని అడగడం రాజకీయం కాదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే కేంద్ర ప్రభుత్వం మొదట జరిగిన తప్పులను అంగీకరించకుండా, సమస్య తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేసింది. ప్రజల ఆగ్రహం, విద్యార్థుల నిరసనలు, సుప్రీంకోర్టు జోక్యం తర్వాతే కొన్ని చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అంటే తప్పు ముందుగా జరిగింది, సవరణ తర్వాత వచ్చింది.
- దేవీప్రసాద్, బెవరేజ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్–
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
