మేడారం జాతరకు కేంద్రం రూ. 3 కోట్లు మంజూరు

మేడారం జాతరకు కేంద్రం రూ. 3 కోట్లు మంజూరు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర అయిన సమ్మక్క సారక్క జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటయించింది.వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. మేడారం జాతర నిర్వహణకు గానూ కేంద్రం రూ.3 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈసారి మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తజనం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.  మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.  

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్కవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం “గిరిజన సర్క్యూట్ పేరిట” రూ. 80 కోట్లతో ఆయా ప్రాంతాలలో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా పూర్తి చేసింది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుపయనం కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణంతో ఆస్వాదించవచ్చు. 

అమ్మవార్లకు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే నాలుగు రోజుల పాటు, దక్షిణ మధ్య రైల్వేశాఖ 30 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. . మేడారం జాతర కోసం జాతరకు 21 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో ప్రతి రోజు ఉదయం 9:52 గంటలకు బయలుదేరి కాజిపేటకు మధ్యాహ్నం 12:12 గంటలకు, వరంగల్‌కు ఒంటిగంటకు చేరుకుంటుంది. తిరిగి అదే మధ్యాహ్నం 1:55 గంటలకు వరంగల్‌లో బయలుదేరి సాయంత్రం 6:20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

మేడారం జాతర నిర్వహణకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కేటాయించిన  నిధులతో 4 రోజులపాటు 350 మంది నాట్యకారులతో జాతీయ గిరిజన నృత్య వేడుకలు నిర్వహిస్తారు.  గిరిజన యువతకు సాధికారత కార్యక్రమాలతో పాటు ఏకలవ్య & ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గిరిజన కళలు, సాహిత్యం మీద పోటీలు నిర్వహించడం, కోయ గ్రామం నమూనాను పునరుద్ధరించడం, మ్యూజియం వద్ద పార్కు ఏర్పాటు చేస్తున్నారు.  మేడారం జాతరను తెలియజేసేలా డాక్యుమెంటరీని రూపొందించడం, గిరిజన వంటకాలను ప్రదర్శించే స్టాళ్లను ఏర్పాటు చేయడం, పర్యాటకులను ప్రోత్సహించేలా ట్రైబల్ హోం స్టే లను ఏర్పాటు చేశారు.

 మేడారంలో మెరుగైన సేవలకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం పోలీసులు ఉపయోగించనున్నారు.  మేడారం మహా జాతరలో కృత్రిమ మేధ సహాయంతో మేడారం జాతర రద్దీ నియంత్రణ చేయాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను కెమెరాలలో ఇన్స్టాల్ చేసి కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేస్తారు. సిబ్బందిని అప్రమత్తం చేయడానికి, రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించనున్నారు.

 ఎక్కడికక్కడ క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు లెక్కించనున్నారు. గద్దెల చుట్టూ క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో నిరంతరం నిఘా నిర్వహించడంతోపాటు, మేడారం జాతర జరిగే ప్రదేశమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టనున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. వివిధ కారణాల వల్ల జాతరకు వెళ్లలేని భక్తుల కోసం కూడా ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా సమ్మక్క సారక్కకు మొక్కులు చెల్లించుకునే వెసులుబాటు దేవాదాయ శాఖ కల్పించింది.