సుస్థిర వ్యవసాయ మిషన్‌‌తో రైతులకు భరోసా..ఎన్‌‌ఎంఎస్‌‌ ఏ ప్రగతిపై కేంద్రం ప్రకటన

సుస్థిర వ్యవసాయ మిషన్‌‌తో రైతులకు భరోసా..ఎన్‌‌ఎంఎస్‌‌ ఏ ప్రగతిపై కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకుంటూ సాగును లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎస్ఏ)’ దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తెస్తోంది. 2014-~15లో ప్రారంభమైన ఈ మిషన్.. ప్రస్తుతం 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎంఆర్కేవీవై)' లో భాగంగా కొనసాగుతూ దేశవ్యాప్తంగా మంచి మార్పులు తీసుకువస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన 'పర్‌‌ డ్రాప్‌‌ మోర్‌‌ క్రాప్‌‌' పథకం ద్వారా  ఇప్పటివరకు 109 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సాగు పద్ధతులను ప్రవేశపెట్టి, ఇందుకోసం రూ.26,325 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందించింది. వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కోసం రూ. 2,119.84 కోట్లు వెచ్చించి, సుమారు 14.35 లక్షల మంది రైతులకు మేలు చేకూర్చింది. సమీకృత వ్యవసాయ విధానం (ఐఎఫ్ఎస్) ద్వారా సాగు విస్తీర్ణం 8.50 లక్షల హెక్టార్లకు పెరగడం గమనార్హం. మరోవైపు, భూసార పరిరక్షణలో భాగంగా 2015 నుంచి ఇప్పటివరకు 25.79 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.