సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్

సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్
  •     శంషాబాద్ రూరల్ పరిధిలో ఘటన

శంషాబాద్, వెలుగు :  వ్యవసాయ పొలం వద్ద సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ జరిగింది. శంషాబాద్ పరిధిలోని హమీదుల్లా నగర్ కు చెందిన మల్లేష్, మంజుల దంపతులకు పొలం ఉంది. అక్కడే ఉంటుండగా.. సోమవారం భర్త  ఓ ఫంక్షన్ వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో మంజుల(38) పొలంలో చేస్తుండగా ఓ వ్యక్తి కారులో అక్కడికి వెళ్లాడు. పొలంలో డ్రిప్ పైప్ లైన్ తనే వేశానని ఆమెతో చెబుతూ దృష్టి మరల్చేందుకు యత్నించాడు. అనుమానించి వెంటనే వెళ్లిపోవాలని అతడిని హెచ్చరించింది. 

దీంతో అతడు కారును రివర్స్ లో పార్కింగ్ చేసి చేతులకు గ్లోవ్స్ ధరించి వచ్చి మంజులపై దాడికి దిగాడు. అప్రమత్తమైన ఆమె 15 నిమిషాల పాటు పెనుగులాడింది. మంజుల ఎంత అరిచినా చుట్టుపక్కల ఎవరూ లేరు. అతడి చేతిని ఆమె గట్టిగా పట్టుకుని కొరకడంతో తీవ్రస్థాయిలో దాడికి దిగాడు. మంజుల మెడలోని పుస్తెలతాడును లాక్కొని రూమ్ లో నెట్టేసి అతడు పరార్ అయ్యాడు. 

ఆమె కారు వెనకాల కొంత దూరం వెళ్లినా దొరకలేదు. మంజుల కొద్దిసేపటికి తేరుకుని భర్తకు ఫోన్ చేయగా..100 కు కాల్ చేసి చైన్ స్నాచింగ్ విషయం చెప్పగా అక్కడికి పోలీసులు వెళ్లారు. దుండగుడి కారు 2951 నంబర్ ను గుర్తు పెట్టికుంది. బాధితురాలు ఫిర్యాదుతో శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. నిందితుడి కారును గుర్తించినట్లు సమాచారం.