- జిల్లా ప్రిన్సిపల్ సెషన్ జడ్జి, న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ లక్ష్మి శారద
సూర్యాపేట, వెలుగు: విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా ప్రిన్సిపల్ సెషన్ జడ్జి, న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ లక్ష్మి శారద అన్నారు. జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట పట్టణంలోని కోర్టు భవనం నుంచి జూనియర్ కాలేజీ వరకు డ్రగ్ ఫ్రీ ఇండియా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జడ్జి మాట్లాడుతూ.. డ్రగ్స్ అనే మహమ్మారి చాపకింద నీరులా వ్యాపించి యువత జీవితాలను నిర్వీర్యం చేస్తుందన్నారు.
డ్రగ్ ఫ్రీ సూర్యాపేట నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. డ్రగ్స్ తో జీవితాలు, కుటుంబాలు ఆగమయవుతున్నాయన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఎస్పీ నరసింహ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు, ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ ఎడిషనల్ జూనియర్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ చైర్మన్ లింగయ్య, సెక్రటరీ రాజు , ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా అధికారులు, టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
