రూల్స్​ పాటించని డ్రైవర్లు: ఆర్టీసీ బస్సులకు 5,423 చలాన్లు

రూల్స్​ పాటించని డ్రైవర్లు: ఆర్టీసీ బస్సులకు 5,423 చలాన్లు

సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్
సీసీ కెమెరాలకు చిక్కుతున్న డ్రైవర్లు
గ్రేటర్ ఆర్టీసీ కి మూడేళ్లలో రూ.20.65 లక్షల ఫైన్
3,112 చలాన్లకు రూ.11,12 లక్షలు వసూలు
డ్రైవర్ జీతం నుంచి ఫైన్ కట్ చేస్తున్న ఆర్టీసీ

రెడ్ సిగ్నల్, స్టాప్ లైన్ జంప్ చేస్తూ దూసుకెళ్తుంది. దీనికి తోడు  ర్యాష్  డ్రైవింగ్. ట్రాఫిక్ రూల్స్ పై  పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా తమకేమీ పట్టవన్నట్లు ఆర్టీసీ డ్రైవర్లు రూల్స్​ బ్రేక్​చేస్తున్నారు. అలాంటి బస్సులకు చలాన్లతో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారు.

‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’. ఇది మన ఆర్టీసీ నినాదం. రోజూ లక్షల సంఖ్యలో ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరవేస్తూ సామాన్యుని రవాణా సాధనంగా ఆర్టీసీకి డ్రైవర్లు మంచి పేరు తెస్తున్నారు.  అయితే కొంతమంది ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో  నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని కారణంగా బస్సులోని ప్యాసింజర్లతో పాటు రోడ్డుపై వెళ్లే వారు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ట్రాఫిక్ రద్దీ ఉన్న ఏరియాల్లో కూడా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారనే ఆరోపణలున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోని వారికి పోలీసులు ఫైన్ విధిస్తున్నా  డ్రైవర్ల మార్పు రావడం లేదు.

 ట్రాఫిక్ పోలీసుల నిఘా

సిటీలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో తిరుగుతూ నిబంధనలు పాటించని  అన్ని డిపోల బస్సులపై చలాన్లు విధిస్తున్నారు. ఇందులో ఎక్కువగా సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ తో పాటు ‘బస్ బే’లలో బస్సులు నిలుపకుండా రోడ్డుపై అడ్డదిడ్డంగా నిలిపే డ్రైవర్లే ఎక్కువ ఉంటున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ రూల్స్ బ్రేక్ చేస్తున్న డ్రైవర్లకు ఫైన్​ వేస్తున్నారు.  

ఫైన్ వసూలు ఇలా

సిటీ బస్ స్టాప్స్ లో కాకుండా రోడ్లపై బస్సులు నిలిపే డ్రైవర్లకు స్పాట్ చలాన్లతో పాటు,ఈ–చలాన్ విధిస్తున్నారు. ఇందులో ఎక్కువగా సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ వాయిలేషన్స్ ఉన్నాయి. వీటితో పాటు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ  సీసీ కెమేరాలకు చిక్కిన డ్రైవర్ల బస్సు నంబర్ల ఆధారంగా పోలీసులు చలాన్లు జనరేట్ చేస్తున్నారు. డీపోల వారీగా ఆర్టీసీ యాజమాన్యానికి ఈ–చలాన్ నోటీసులు పంపిస్తున్నారు.  బస్ నంబర్, రూట్,టైమ్ ఆధారంగా డ్యూటీలో ఉన్న డ్రైవర్ల నుంచి డిపో యాజమాన్యం ఫైన్ డబ్బులను వసూలు చేస్తోంది. రూల్స్ బ్రేక్ చేసిన డ్రైవర్ జీతంలో నుంచి ట్రాఫిక్ చలానా ఎమౌంట్ ను వసూలు చేసి ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ కి చెల్లిస్తోంది. అయినప్పటికీ పనితీరులో మార్పు లేని వారిని ట్రైనింగ్ కు పంపిస్తోంది. ఇలా ఏటా నమోదవుతున్న కేసులతో ఫైన్ డబ్బులను కలెక్ట్ చేసి రూల్స్ బ్రేక్ చేస్తున్న డ్రైవర్లకు ఆర్టీసీ మెమోలు జారీ చేస్తోంది.

పెండింగ్ లో 2,311 చలాన్లు

మూడేళ్లలో 3,444 ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని బస్సులపై 5,423 చలాన్లను పోలీసులు జనరేట్ చేశారు. ఈ చలాన్ల ఫైన్ మొత్తం రూ.20,64 లక్షలు ఆర్టీసీ యాజమాన్యానికి పంపించారు. ఇందులో 5,423 ట్రాఫిక్ చలాన్లలో 3,112 చలానాల ఎమౌంట్  రూ.11,12లక్షలను ట్రాఫిక్ పోలీసులు వసూలు చేశారు. మరో 2,311 చలాన్ల మొత్తం ఎమౌంట్ రూ.9,52లక్షలు పెండింగ్ లో ఉంది.  మూడేళ్లతో పాటు ఈ ఏడాది జనవరి నుంచి జులై 31 దాకా 3,019 ట్రాఫిక్ చలాన్లు విధించారు. వీటిలో కేవలం 189 చలాన్లకు రూ.1,16,లక్షలు ఆర్టీసీ చెల్లించింది. మరో 2,830 చలాన్లకు  సంబంధించిన రూ.15,77లక్షల ఫైన్ అమౌంట్​ ఆర్టీసీ డ్రైవర్ల నుంచి ట్రాఫిక్ పోలీసులకు వసూలు రావాల్సి ఉంది.