
- నేటి (జులై 10) నుంచి ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్
- బరిలోకి బుమ్రా, ఆర్చర్.. విజయంపై ఇరు జట్ల దృష్టి
- మ. 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్ , జియో హాట్‌స్టార్‌లో లైవ్
లండన్: ఓవైపు జస్‌ప్రీత్ బుమ్రా.. మరోవైపు జోఫ్రా ఆర్చర్.. దీనికి తోడు పచ్చికతో కూడిన పిచ్.. ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో గురువారం (జులై 10) నుంచి జరిగే మూడో టెస్ట్‌లో ఇండియా, ఇంగ్లండ్ బ్యాటర్లకు అసలు పరీక్ష ఎదురుకానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చెరో విజయంతో జోరు మీదున్న ఇరుజట్లకు ఈ మ్యాచ్ కఠిన సవాల్‌గా మారనుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఇండియాను ఓడించడం చాలా ఈజీ అని భావించిన ఇంగ్లండ్‌కు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా చుక్కలు చూపించింది.
లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో క్యాచ్‌లు మిస్ చేయడం, లోయర్ ఆర్డర్ ఫెయిలవడం వంటి అంశాలను సరిదిద్దుకుని ఎడ్జ్‌బాస్టన్‌లో బరిలోకి దిగిన టీమిండియా 336 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సూపర్ ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పటివరకు ఎక్కువ సెషన్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపెట్టిన కుర్రాళ్లు ఇప్పుడు లార్డ్స్‌లోనూ దాన్ని కొనసాగించాలని పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు.
మరోవైపు ఎక్కువగా ‘బజ్‌బాల్’ ఆటను నమ్ముకున్న ఇంగ్లండ్ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఫ్లాట్ ట్రాక్‌లపై అద్భుతంగా రాణించిన టీమిండియా బ్యాటర్లను కట్టడి చేసేందుకు ఈసారి సీమ్ కదలికలు ఎక్కువగా ఉండే పిచ్‌ను ఉపయోగిస్తున్నారు. లార్డ్స్ పిచ్‌ల్లో ఉండే ప్రత్యేకమైన స్లోప్ వల్ల కూడా బౌలర్లకు అదనపు బలం చేకూరనుంది.
కరుణ్ ఫామ్‌పైనే ఆందోళన
బ్యాటింగ్‌లో ఇండియాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. కరుణ్ నాయర్ మినహా మిగతా వారందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఒక ఇన్నింగ్స్‌లో ఫెయిలైనా మరో ఇన్నింగ్స్‌లో తడాఖా చూపెడుతున్నారు. అయితే, లెంగ్త్ బాల్స్‌ను ఆడటంలో అసౌకర్యంగా కనిపిస్తున్న కరుణ్ దాన్ని అధిగమించడంపై దృష్టి పెట్టాలి. కేఎల్ రాహుల్, గిల్, రిషబ్ పంత్, జడేజా ఫామ్ లో ఉండటం కాన్ఫిడెన్స్ పెంచే అంశం.
తుది జట్టులో జరిగే ఏకైక మార్పుగా.. ప్రసిధ్ కృష్ణ ప్లేస్‌లో బుమ్రా రానున్నాడు. లీడ్స్ మ్యాచ్ తర్వాత పేసర్ల సామర్థ్యంపై తీవ్రమైన సందేహాలు వెల్లువెత్తాయి. కానీ ఆకాశ్ దీప్, సిరాజ్.. ఎడ్జ్‌బాస్టన్‌లో వాటన్నింటిని పటాపంచలు చేశారు. ఇప్పుడు బుమ్రా కూడా వస్తుండటంతో బౌలింగ్ బలం మరింత పెరగనుంది. రెండో టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ నుంచి ఇంగ్లండ్‌కు మరోసారి ముప్పు పొంచి ఉంది.
ఎందుకంటే అన్ని సమయాల్లో అతను స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేస్తున్నాడు. తన బౌలింగ్‌లో బ్యాటర్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఆడినా వికెట్ ఎగరడం ఖాయం. 2021లో లార్డ్స్‌లో సిరాజ్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడు. ఇది అతనికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ఇక పిచ్ ఎలా ఉన్నా బుమ్రాకు పనే లేదు. తన ట్రేడ్ మార్క్ బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తాడు. రెండో టెస్ట్‌లో ఆడిన ముగ్గురు ఆల్రౌండర్లలో జడేజా, సుందర్ స్పిన్నర్లుగా ఉన్నారు. వీళ్లతో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డిని కొనసాగించనున్నారు.
ఆర్చర్ రాకతో..
గాయాలతో నాలుగేళ్లుగా టెస్ట్‌లకు దూరంగా ఉన్న పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. జోష్ టంగ్ ప్లేస్‌లో అతను ఆడనున్నాడు. ఆర్చర్ రాకతో ఇంగ్లిష్ బౌలింగ్ దాడి మరింత పదునెక్కింది. రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిలైన ఓపెన్ జాక్ క్రాలీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ గాడిలో పడాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ అతని వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్ బ్యాట్లకు పని చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది.
బ్రూక్, జెమీ స్మిత్ ఫామ్‌లో ఉండటం ఆత్మ విశ్వాసాన్ని పెంచే అంశం. లోయర్ ఆర్డర్ కూడా బ్యాటింగ్‌లో మెరిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. ప్రధాన పేసర్లు క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్ అనుకున్న స్థాయిలో వికెట్లు తీయలేకపోతున్నారు. ఏకైక స్పిన్నర్ షోయబ్ బషీర్, పార్ట్ టైమర్లుగా బ్రూక్, రూట్ ఫర్వాలేదనిపిస్తుండటం ఇంగ్లిష్ జట్టుకు కాస్త ఊరట కలిగించే అంశం.
తుది జట్లు
ఇండియా (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, నితీశ్ కుమార్, జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా.
ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.