చలో హట్టా​ విలేజ్

చలో హట్టా​ విలేజ్

వెకేషన్​కి వెళ్తే నచ్చినట్టు ఎంజాయ్ చేయాలి. అక్కడున్న వెరైటీలన్నీ చూసి రావాలి. రుచికరమైన ఫుడ్ టేస్ట్ చేయాలి. ఆ ఊరి ట్రెడిషన్, కల్చర్, హిస్టరీ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్‌ కలగాలి. అలాంటి క్రేజీ టూర్ కోసం వెతుకుతున్నారా? అయితే.. చలో హట్టా​ విలేజ్​. 

ఇది టూరిస్ట్​ల హ్యాపీనెస్​కి గ్యారేజ్.

హట్టా హెరిటేజ్ విలేజ్ దుబాయికి 130 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరు కొండల మధ్యలో ఉంది. ఇక్కడున్న హజర్ కొండ ఎక్కితే,  హట్టా విలేజ్ మొత్తం కనిపిస్తుంది. ఆ ఏరియాను మొదట్లో ఎఎల్ హజరిన్ అనేవాళ్లు. అంటే ఉత్తర, దక్షిణ సరిహద్దుల మధ్య ఉన్న రెండు కొండల అంచు అని అర్థం. ​హట్టా వ్యవసాయం చేయడానికి బెస్ట్ ప్లేస్​. ఎందుకంటే ఇక్కడంతా సారవంతమైన నేలే. ఫలజ్ అనే పురాతన ఇరిగేషన్ పద్ధతులు వాడుకలో ఉన్నాయి. పూర్వకాలంలో అక్కడి ప్రజలు తాటి, కర్జూర పంటలు సాగుచేసేవాళ్లు. కర్జూరాలను ఎండబెట్టి అమ్మేవాళ్లు. తాటాకులను చాప, ఫ్యాన్, కార్పెట్ వంటి వాటికోసం వాడేవాళ్లు. చెట్టు మొద్దులతో టెంట్, ఇండ్లు కట్టుకునేవాళ్లు. ఇలా ఈ రెండిటితోనే వాళ్ల రోజు గడిచేది. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం హట్టాలో పదిశాతం భూమి పంట నేలగానే ఉంది. 

వాననీటికి కరువొస్తే, బావుల్లో నీళ్లు తోడుకునేవాళ్లు పాత రోజుల్లో. డ్యామ్​లు కట్టాక, కావాల్సినంత నీరు దొరుకుతోంది. హట్టా డ్యామ్​ని 1990లో కట్టారు. ఆ రిజర్వాయర్ నిండటానికి రెండేండ్లు పట్టింది. హట్టా విలేజ్ టూరిజంలో డ్యామ్ కచ్చితంగా చూడాల్సిందే. అక్కడ ఫొటోలు తీసుకోవచ్చు. దానికి దగ్గర్లో ట్రెక్కింగ్ చేయొచ్చు. పురాతన విలేజ్​ అయిన హట్టాని గవర్నమెంట్ మళ్లీ కట్టించింది. 2001లో దీన్ని ఓపెన్ చేసింది. అక్కడక్కడ గుడిసెలు, బిల్డింగ్​లు, సంప్రదాయబద్ధమైన వస్తువులతో కళకళలాడుతుంది. ఈ ఊళ్లో బెయిట్ ఎఎల్ వాలి అనే ప్లేస్ ఉంది. ఇది చాలా పెద్ద ఇండ్లలో ఒకటి. ఇక్కడ వాళ్ల నాయకుడు ఉంటాడు. దాని బయట మట్టి, తోలు, రాగితో చేసే నగలు, ఆయుధాలు, కుండలు, పాత్రలు వంటివి తయారుచేస్తుంటారు గ్రామస్తులు. హట్టా కోటను1896లో కట్టారు. 1995లో కొండరాళ్లు, మట్టి ఇటుకలతో రీమోడల్ చేశారు. సీలింగ్ కోసం తాటాకులు, మొద్దు, మట్టి వాడారు. ఇక్కడ ఎఎల్ షరియా సైట్ అనే పామ్ ట్రీ ఫామ్ ఉంది. అలాగే 2004లో కట్టిన హట్టా హిల్ పార్క్ కూడా టూరిస్ట్ అట్రాక్షన్​గా ఉంది. హట్టా హనీ బీ సెంటర్​లో వేలల్లో తేనెటీగలు కనిపిస్తాయి. అవుట్​డోర్​ గార్డెన్​లో పిల్లలు ఆడుకోవచ్చు. ఆర్గానిక్ కెఫెలో దొరికే స్వచ్ఛమైన తేనె, తేనెతో తయారైన ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు.  

చూసేవి.. చేసేవి..

హట్టాలో ఏడాదంతా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ‘హట్టా వాడి హబ్’కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఏటా మే వరకు జరుగుతాయి. ఆ తర్వాత మూసేస్తారు. తిరిగి అక్టోబర్​లో ఓపెన్ చేస్తారు. ఇక్కడ అడ్వెంచర్స్, యాక్టివిటీస్ బోలెడు ఉన్నాయి. కార్టింగ్, జోర్బింగ్, స్లింగ్ షాట్, యాక్స్ త్రోయింగ్, ఆర్చరీ, ఫ్రీ– ఫాల్ జంప్స్, రోప్ కోర్సెర్, వాల్ క్లైంబింగ్ వంటి అడ్వెంచర్స్ చేయొచ్చు. అలాగే కయాకింగ్, హైకింగ్ ట్రయల్స్ చేయొచ్చు. పోయినేడాదే కొత్త యాక్టివిటీస్ కూడా పెట్టారు. అవేంటంటే.. 500మీటర్ల ఇన్​ఫ్లాటబుల్ అబ్​స్టకిల్ కోర్స్, రోవర్స్, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ రోడ్ ట్రావెల్ వంటివి చేయొచ్చు. ఇ–బైక్స్​ వచ్చాక హట్టా వాడి హబ్​లో మౌంటెన్ బైకింగ్ వాటితోనే చేస్తున్నారు. చలికాలంలో పారాగ్లైడింగ్ చేయొచ్చు. 

వెరైటీ పార్క్​లు

హట్టాలో కారవ్యాన్ పార్క్, డోమ్ పార్క్​ ప్రత్యేక ఆకర్షణ. కారవ్యాన్ పార్క్​లో ఎటు చూసినా బుల్లెట్ ట్రైన్ బోగీల్లా ఉండే కారవ్యాన్​లు కనిపిస్తాయి. ఈ పార్క్​ని పోయినేడాది ప్రారంభించారు. డోమ్​ పార్క్​లో డోమ్​ ఆకారంలో ఉన్న గుడారాలు 15 ఉన్నాయి. బయటి నుంచి చూడ్డానికి అవి డేరాల్లా కనిపించినా, లోపల మాత్రం లగ్జరీగా ఉంటాయి. అవి ఇద్దరు పెద్దవాళ్లు, ఇద్దరు చిన్నపిల్లలకు సరిపోతాయి. వాటిలో టీవీ, ఫ్రిజ్, వైఫై సౌకర్యాలు ఉన్నాయి. ఈ పార్క్​లో 999 దిర్హామ్​​లు(రూ.21,657) నుంచి రేట్లు మొదలవుతాయి. రిసార్ట్​ని సీజన్​లోనే ఓపెన్ చేస్తారు. దానికోసం ముందే బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ వండుకుని తినొచ్చు. లేదా దగ్గర్లోనే ఫుడ్ ట్రక్​లు ఉంటాయి. వాటి దగ్గర తినొచ్చు. 

ఎలా వెళ్లాలి?

దుబాయి నుంచి కార్​లో వెళ్తే గంటన్నర జర్నీ. అబుదాబి నుంచైతే రెండున్నర గంటలు పడుతుంది. బస్​లో వెళ్లాలంటే దుబాయి​లో ఉన్న ఎఐ సబ్ఖా బస్ స్టేషన్​కి వెళ్లాలి. బస్​లో రెండు గంటల్లో హట్టా చేరుకోవచ్చు.