- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో నాడు రాయలసీమలో రొయ్యల పులుసు తిని కేసీఆర్ చేసిన దొంగతనం బయటపడిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్, జగన్ తో లాలూచీ పడి, ఏపీకి కృష్ణా నీళ్లను అడ్డగోలుగా తరలించుకునేందుకు అనుమతిచ్చారని, కేసీఆర్ఆశీస్సులతోనే జగన్ఎలాంటి ఆటంకాలు లేకుండా రాయలసీమ లిఫ్టు పనులను చేపట్టగలిగారన్నారు.
తన హయాంలో రాయలసీమ లిఫ్టు పనులు స్పీడప్ చేశానని, కానీ సీఎం రేవంత్ ఒత్తిడి తెచ్చి చంద్రబాబు ద్వారా పనులను ఆపించారని జగన్ చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. కృష్ణా నీళ్లను అక్రమంగా ఏపీకి తరలించడం ద్వారా దక్షిణ తెలంగాణ రైతుల ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టారని చామల ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్రెడ్డి చెప్పిన మాటలను జగన్ గుర్తు చేయడం తమ చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోందన్నారు.
