సెమీ కండక్టర్ పరిశ్రమను గుజరాత్కు ఎందుకు తరలించారు? : ఎంపీ చామల

సెమీ కండక్టర్ పరిశ్రమను గుజరాత్కు ఎందుకు తరలించారు? : ఎంపీ చామల
  • తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి: ఎంపీ చామల 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్​ పరిశ్రమను గుజరాత్ కు ఎందుకు తరలించారో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్  అభివృద్ధి కోసం చేపడుతున్న మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో వంటి ప్రాజెక్టులకు పర్మిషన్లు, ఫండ్స్ రాకుండా ఎందుకు కుట్ర పన్నుతున్నారో చెప్పాలన్నారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచాలని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 

తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్​ నేతలు ఇప్పుడు సుద్దపూస ముచ్చట్లు చెప్తున్నారని  ఫైరయ్యారు. బీఆర్ఎస్ దగ్గర ఓట్లు అడుక్కునే  దౌర్భాగ్య పరిస్థితుల్లో బీజేపీ ఉందన్నారు. ‘మాకు సున్నా సీట్లు వచ్చినా పర్వాలేదు కానీ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు.. అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఉంది’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.