
- పదేండ్లు సక్కగ పరిపాలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు: చామల
న్యూఢిల్లీ, వెలుగు: మిగులు రాష్ట్రాన్ని చేతిలో పెడితే.. ‘అప్పు చేసి–పప్పుకూడు’ అన్నట్టుగా కేసీఆర్ మొత్తం దివాలా తీయించాడని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అక్రమాలు, దోపిడీలు, దుబారా ఖర్చులు లేకుండా బీఆర్ఎస్ పదేండ్ల పాలన చేసి ఉంటే.. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం వివరించే దుస్థితి రాకపోయేదన్నారు. జిమ్ లో తాకిన దెబ్బకు కేటీఆర్ మైండ్ దొబ్బిందని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మంచి ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేస్తే.. ప్రజల ముందు సీఎంను విలన్ గా నిలబెట్టాలని కేటీఆర్ చూస్తున్నారన్నారు.
సమ్మె చేస్తామంటే కేసీఆర్ మాదిరిగా ఉద్యోగుల్ని బయపెట్టి, బెదిరించే పద్ధతి తమది కాదన్నారు. 2019 లో ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మెచేస్తే.. కనీసం కేసీఆర్ ఆ సమ్మెను విరమించే ప్రయత్నం కూడా చేయలేదని గుర్తుచేశారు. మరోసారి సమ్మె అనే పదం వినపడకుండా.. ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్, రవీందర్ రెడ్డి, స్వామి గౌడ్ కు పదవుల ఆశ చూపి నోరు మూయించారన్నారు. రాష్ట్ర దోపిడీలో కేటీఆర్ భాగస్వామి అని చామల ఆరోపించారు.
అలాంటి వ్యక్తి దోపిడీకి ఆస్కారం లేని అంశాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ అక్రమంగా డబ్బు మళ్లించినట్లు.. మిస్ వరల్డ్ పోటీలకు తాము ఫండ్స్ డైవర్ట్ చేయడం లేదన్నారు. పిట్ట కథలు చెప్పుడు, తొడలు కొట్టుడు, ఇంటికి పోయి పడుకునుడు కేటీఆర్ విధానమన్నారు. పార్టీ నుంచి చెల్లిని బయటకు నెట్టి, బావను పక్కకు తప్పించి తానే సీఎం అయినట్లు కేటీఆర్ పగటి కలలు కంటున్నారని చామల విమర్శించారు.