సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా.. మరో ఇద్దరికి కూడా పాజిటివ్

V6 Velugu Posted on Nov 30, 2021

భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ్నుంచి తాజాగా ఇండియాకు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. దీంతో అతని కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు జరిపారు. వారిలో కూడా ఇద్దరు కరోనా బారిన పడినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్లే చండిఘడ్ కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి ఇటీవలే సౌతాఫ్రికా నుంచి వచ్చాడు. అతనికి పరీక్షలు చేస్తే.. కరోనా పాజిటివ్ అని తేలింది. అతని కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. 

దీంతో వారి శాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం అధికారులు ఢిల్లీ ఎన్సిడీసీకి పంపారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కోవిడ్ సోకిన వ్యక్తి నవంబర్ 21న భారత్ కు వచ్చాడు. భారత్ కు రాగానే జరిపిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. నిన్న జరిపిన పరీక్షలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కోవిడ్ సోకిన వ్యక్తులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటీన్ లో ఉన్నారు. 

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కట్టడి చేయాలని సూచించింది. విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరపాలని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా 'ఎట్‌ రిస్క్‌' జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Tagged south africa, COVID positive, Corona New Variant, omicron scare

Latest Videos

Subscribe Now

More News