చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ సాధ్యమేనా..?

చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ సాధ్యమేనా..?

2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది, ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సిద్ధం పేరుతో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార వైసీపీ దూసుకుపోతుంటే, జగన్ ను గద్దె దింపటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి సభలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి టీడీపీ, జనసేన పార్టీలు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదని, సొసైటీకి బ్యాక్ బోన్ క్లాసెస్ అని, బీసీల డిఎన్ఏ లోనే టీడీపీ ఉందని స్టేట్మెంట్స్ ఇచ్చి బీసీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు చంద్రబాబు.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా బీసీ డిక్లరేషన్లో భాగంగా చంద్రబాబు బీసీలపై కురిపించిన హామీల వర్షం చుస్తే పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్ళ నుండే నెలకు 4వేల పెన్షన్ ఇస్తామంటూ హామీ ఇచ్చాడు బాబు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ ఓట్లు టార్గెట్ గానే ఈ హామీ ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ సర్కార్ 60ఏళ్ళు పైబడ్డ వారికి 3వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికే నానా తంటాలు పడుతుంటే, చంద్రబాబు వచ్చాక 4వేల రూపాయల పెన్షన్ అందులోను బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ ఇవ్వటానికి బాబు ఇంకెన్ని తంటాలు పడాల్సి వస్తుందో.

ప్రత్యేక రక్షణ చట్టం, బీసీ సబ్ ప్లాన్, స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్, జనాభా ప్రాతిపదికన బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కులగణనకు చట్ట బద్ధత, చంద్రన్న భీమా, శాశ్వత కుల ధ్రువీకరణ వంటి పది హామీలు బాబు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఉన్నాయి. ఈ సభలో ప్రసంగిస్తూ బీసీల డిఎన్ఏలోనే టీడీపీ ఉందని అన్నారు. ఒక్కసారి గతంలోకి వెళ్లి చుస్తే, 2014 ఎన్నికల్లో బాబు అధికారంలోకి వచ్చాక, పని చేసే నాయి బ్రాహ్మణులు తమ వినతులు సమర్పించేందుకు సెక్రటేరియట్ వద్దకు వస్తే, తోకలు కట్ చేస్తానంటూ వారిపై మండిపడ్డ సంఘటన గుర్తు చేసుకుంటే, బీసీల డిఎన్ఏలో టీడీపీ మాట అటుంచితే, అసలు బాబు డిఎన్ఏలో బీసీలు ఉన్నారా అన్న అనుమానం కలుగుతుంది. మొత్తానికి ఈ బీసీ డిక్లరేషన్ టీడీపీకి దూరమైన బీసీ వర్గాలను దగ్గర చేస్తుందా లేదా చూడాలి.