హైదరాబాద్‌ బంగారు బాతు.. అప్పనంగా కొట్టేశారు: చంద్రబాబు

హైదరాబాద్‌ బంగారు బాతు.. అప్పనంగా కొట్టేశారు: చంద్రబాబు

‘అమరావతి శంకుస్థాపన సమయంలో ఆంధ్రప్రదేశ్‌‌కు రూ.500 కోట్లిద్దామని తెలంగాణ ప్రభుత్వం అనుకుందట. ప్రధాని మోడీ ఏమీ ఇవ్వకపోవడంతో కేసీఆర్‌‌ కూడా ఇవ్వలేదట. కేసీఆర్‌‌.. అమరావతికి నీభిక్ష అవసరం లేదు. కావాలంటే నేనే రూ.500 కోట్లిస్తా’ అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ బంగారు బాతు. అప్పనంగా కేసీఆర్‌‌ కొట్టేశారు. హేతుబద్ధంగా విభజన చేయకుండా మనల్ని కట్టుబట్టలతో నెట్టేశారు’ అనిఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అనంతపురం, కృష్ణా జిల్లాల్లో బాబు ప్రచారం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ కూడా పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధిని చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని బాబు విమర్శించారు.అందుకే జగన్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ‘మోడీ, కేసీఆర్, జగన్ ఏపీ పాలిట దుష్టశక్తులు. రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించేందుకు దీక్షబూనారు’ అని మండిపడ్డారు. ఏప్రిల్ 4న డ్వాక్రా మహిళలకురూ.4 వేలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

గుండెపోటొస్తే తల పగులుతదా?
‘ఢిల్లీలో ఉన్న దొంగల కాపలాదారుడు మోడీ. జగన్‌‌ లాంటి వాళ్లను కాపాడుతున్నారు’ అని బాబు ఆరోపించారు. కోడికత్తితో జగన్‌‌ పొడిపించుకుంటే అదోప్రపంచ సమస్యలా కేంద్రం ఎంక్వైరీ వేసిందన్నారు.వివేకా హత్యనూ ఇలాగే చేశారని విమర్శించారు.హత్య చేసి దాచిపెట్టాలని వైఎస్సార్‌‌సీపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ‘జగన్‌‌ బండారం బయటపడకుండా ఉండేందుకే వివేకా భార్య, కూతురితో నాటకాలాడిస్తున్నారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలను’ అని హెచ్చరించారు. హత్యలో కడప మాజీ ఎంపీ అవినాశ్‌‌రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.

జగన్‌‌.. సెగ్మెంట్‌‌కు 10 కోట్లు పంచారు
‘మోడీ, కేసీఆర్‌‌ ఇచ్చిన సొమ్మును జగన్ ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున పంచారు. అవినీతిసొమ్ముతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు’అని బాబు విమర్శించారు. జగన్ కోసం అన్ని వ్యవస్థలను టీడీపీపైకి మోడీ ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు.‘బీజేపీ పెడ బుద్ధుల వల్ల ఆర్బీఐ గవర్నర్లు రాజీనామాచేసి వెళ్లిపోయారు. సీబీఐనీ భ్రష్టు పట్టించేశారు. ఇప్పుడు ఈసీకే తూట్లు పొడుస్తున్నారు’ అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ గతే ఇప్పుడు వైఎస్సార్‌‌సీపీకీ పట్టేలా చేయాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.

మీ కోసం బుల్లెట్‌‌లా దూసుకెళ్తా
పట్టిసీమ, హంద్రీనీవా, పోలవరానికి జగన్ అడ్డుపడ్డారని బాబు ఆరోపించారు. తాను భయపడి ఉంటే రాయలసీమకు నీళ్లు వచ్చేవి కావన్నారు. నదుల అనుసంధానంతో అనంతపురం చరిత్ర మారుస్తానని హామీ ఇచ్చారు. ‘మీ మంచి కోసం బుల్లెట్‌‌లా దూసుకెళ్తా’నన్నారు. ప్రపంచంలో 5 ముఖ్య నగరాల్లోఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతానని చెప్పారు. త్వరలోనే ఏపీలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలొస్తాయని తెలిపారు.