15 రోజుల్లో అవినీతి బయటపెడతా

15 రోజుల్లో అవినీతి బయటపెడతా
  • పోలవరం పనుల్లో దోచుకుతిన్నారు
  • ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్

పోలవరం ప్రాజెక్టులో మాజీ సీఎం చంద్రబాబు అవినీతిని మరో 15 రోజుల్లో బయటపెడతానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టులో అందినకాడికి దోచుకుతిన్నారని మండిపడ్డారు. తాము ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ రాగానే బాబు అవినీతిని ప్రజల ముందు ఉంచుతామన్నారు. శుక్రవారం  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు పనులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. “కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకుండానే రూ.724 కోట్లు అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌గా ఇచ్చి కమీషన్లు దండుకున్నారు. తక్కువ పనికి ఎక్కువ డబ్బులు ఖజానా నుంచి డ్రా చేసుకునేందుకు అనవసరమైన పనులు చేయించారు. మొదట పూర్తి చేయాల్సిన పనులను కాకుండా తేలికగా అయిపోయే పనులే చేశారు. చంద్రబాబు కేబినేట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన యనుమల రామృకృష్ణుడు వియ్యంకుడికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి అప్పనంగా దోచిపెట్టారు. చంద్రబాబు నిర్వాకం వల్ల 4 నెలలు పనులు ఆపేసే పరిస్థితి వచ్చింది. నవంబర్ నుంచి పనులు మళ్లీ మొదలుపెట్టి 2021 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అన్నారు. పోలవరం కాంట్రాక్టుల కేటాయింపు కోసం రివర్స్ టెండరింగ్ కు వెళతామని చెప్పారు. దీంతో రూ. 6,500 కోట్ల పనుల్లో 15 నుంచి 20 శాతం ఆదా అవుతుందన్నారు. జగన్ ఆరోపణలను బాబు ఖండించారు. తమ ప్రభుత్వంలో నిబంధనల మేరకే కాంట్రాక్టులు ఇచ్చామన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చేతకాకనే పనులు ఆపేశారని విమర్శించారు. ఇలా చేస్తే ఏపీ ప్రజలు ఎప్పటికీ గోదావరి నీళ్లు చూడలేరని అన్నారు.