రాష్ట్రాభివృద్ధి జరగాలంటే బాబును సీఎంను చేయండి: దేవెగౌడ

రాష్ట్రాభివృద్ధి జరగాలంటే బాబును సీఎంను చేయండి: దేవెగౌడ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు  కృష్ణా జిల్లా తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం తర్వాత  దేవెగౌడ విజయవాడలోని ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి జరగాలంటే ప్రజలంతా చంద్రబాబునే సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో టిడిపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు రుణమాఫీని ఆదర్శంగా తీసుకుని తామూ కర్ణాటకలో అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్రం తీరుకు నిరసనగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటికి మీదకు తెచ్చిన చరిత్ర టిడిపిదేనని, ఇప్పుడు అదే పని మళ్లా చంద్రబాబు చేస్తున్నాడని ఆయన అన్నారు.

రాష్ట్రం విడిపోయాక ఏపీకి ఇచ్చిన హామీలను ప్రధాని మోడీ పట్టించుకోలేదని, కనీసం రైతులకు ఇచ్చిన హామీలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదని దేవెగౌడ అన్నారు. తన గురువు అద్వానీనే పక్కన పెట్టిన ఘనత  మోడీది అనీ , ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవ్వడానికి మోడీ హవా తగ్గడమే అని ఆయన పేర్కొన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమని  దేవగౌడ ఈ సందర్భంగా అన్నారు. వీవీ ప్యాట్ల విషయంలో, పేపర్ బ్యాలెట్ల విషయంలోనూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యర్థులందరూ అవినీతిపరులు, తాము సచ్చీలురమనే భావన కలిగించేందుకు మోడీ అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ తామంతా కలసి ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.