
విజయవాడ: గెలిచినప్పుడు ఆనందం, ఓడినప్పుడు ఆవేదన సహజమని, అయినా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో TDP శ్రేణులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నానన్నారు. తెలుగుదేశం కార్యకర్తల్లో ఏ ఒక్కరూ ఒంటరి కాదని నేతలు ధైర్యంగా ఉండాలన్నారు బాబు. 37 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఐదుసార్లు గెలిచామని, నాలుగు సార్లు ఓడిపోయామని గుర్తు చేశారు.
భావితరాలకు పార్టీని అందించాల్సిన బాధ్యత తమపై ఉందని, రాజకీయపార్టీగా ప్రజల పట్ల ఒక బాధ్యత ఉందన్నారు. తమకు ఓట్లేసిన ప్రజలు, నమ్మిన కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యమన్నారు.