మండలిని రద్దు చేస్తే.. మళ్లీ తెస్తాం

మండలిని రద్దు చేస్తే.. మళ్లీ తెస్తాం

అమరావతి, వెలుగు: ఏపీలో జగన్ సర్కారు శాసనమండలిని రద్దు చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెస్తామని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ తిక్క మనిషిలా ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తున్నారని విమర్శించారు. జగన్ నిర్వాకంతో ఏపీని చూసి పక్క రాష్ర్టాల్లో నవ్వుకుంటున్నారని అన్నారు. తన అనుభవానికి కూడా మర్యాద ఇవ్వకుండా అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చేయాలనుకోవడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు.  ప్రభుత్వం కౌన్సిల్ రద్దుకు ప్రయత్నాలు చేస్తోందనే వార్తల నేపథ్యంలో శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో సీనియర్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దుకు ప్రభుత్వం బిల్లు తెస్తే ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిన మండలి చైర్మన్ షరీఫ్ ను మంత్రులు కొట్టబోయారని ఆరోపించారు. మండలికి గెస్ట్ మెంబర్స్ గా వచ్చిన మంత్రులు కౌన్సిల్ పనులను ఎలా శాసిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ తరహాలోనే మండలి కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉందన్నారు. శాసనమండలి తాము చెప్పినట్లు వినకపోతే రద్దు చేస్తామని సీఎం జగన్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. శాసనమండలిని రద్దు చేసే అధికారం సీఎంకు లేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించకపోతే కౌన్సిల్ రద్దు కాదని తెలిపారు. రాజధాని తరలింపునకు జగన్ చేస్తున్న కుట్రలను కేంద్రం గమనిస్తోందన్నారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకమని ప్రకటించిన బీజేపీ.. కౌన్సిల్ రద్దుకుఅంగీకరించే పరిస్థితి లేదని చెప్పారు. ఒకవేళ రద్దు చేయాలనుకుంటే  ఏడాదికి పైగా సమయం పడుతుందన్నారు.

70 మంది ఎమ్మెల్యేలు దాడికి దిగారు: బాబు

మండలిలో జరిగిన పరిణామాలు, వైసీపీ తీరుపై చంద్రబాబు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్  విశ్వభూషణ్ హరిచందన్ ను పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు భేటీ అయ్యారు.  కౌన్సిల్ రద్దు, రాజధాని తరలింపుపై జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలన వికేంద్రీకరణ బిల్లులను టీడీపీ అడ్డుకుంటోందనే కోపంతో మంత్రులతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు తమ సభ్యులపై దాడికి దిగారని ఆరోపించారు.