
అమరావతి, వెలుగు: హైదరాబాద్ ను అభివృద్ధి చేసి తప్పు చేశానని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఎందుకని చాలా మంది ప్రశ్నించారని, ఇప్పుడు అదే తెలంగాణకు ఆదాయం ఇస్తోందని చెప్పారు. “ఉమ్మడి ఏపీని వదిలి హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందుకు బాధ పడుతున్నా. నేను చేపట్టిన హైటెక్ సిటీ, రింగ్ రోడ్, సైబరాబాద్ నిర్మాణాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నింటికీ అడ్డుపడుతున్నారు” అని అన్నారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు లోన్ రిజెక్ట్ చేసిన అంశంపై సోమవారం ఏపీ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. అప్పు తెచ్చి రాజధాని కట్టి 25 ఏళ్ల తర్వాత తీరుద్దామన్న ముందుచూపుతో ఆలోచించినట్లు చంద్రబాబు చెప్పారు. దాని కోసమే వరల్డ్ బ్యాంకు లోన్ కు దరఖాస్తు చేశానన్నారు. వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అభివృద్ధికి అడ్డుపడుతూ అప్పు రాకుండా చేసిందన్నారు. జగన్ నిర్వాకంతోనే అప్పు ఇవ్వడం లేదని వరల్డ్ బ్యాంకు లేఖ రాసిందని చెప్పారు. చంద్రబాబు ఆరోపణలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి అప్పు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసిందని, దాన్ని సభలో చదివి వినిపించారు. చంద్రబాబు జీవితాంతం అబద్ధాలు చెబుతూనే ఉంటారని విమర్శించారు.
బీసీ స్పీకర్ పై దౌర్జన్యమా?: సీఎం జగన్
“నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు 50 % కోటా కల్పించే బిల్లులకు అడ్డుపడతారా? మీరేం ప్రతిపక్షం” అంటూ టీడీపీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. బీసీ వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే గౌరవించడం పోయి పోడియం వద్దకు వెళ్లి దౌర్జన్యం చేయాలని చూస్తారా అంటూ ధ్వజమెత్తారు. బాబుకు మాట్లాడే అవకాశం ఇస్తే పస లేని స్టోరీలు చెబుతున్నారన్నారు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, పరిశ్రమల్లో స్థానికులకు 75 % ఉద్యోగాలు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.