నాడు ముద్దులు.. నేడు పిడి గుద్దులు.. ఇది సీఎం తీరు

నాడు ముద్దులు..  నేడు పిడి గుద్దులు.. ఇది సీఎం తీరు

సీఎం జగన్  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరుకు వచ్చి  ప్రజలకు ముద్దులు పెట్టాడని, ఇప్పుడు మాత్రం తన నిర్ణయాలతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని  టీడీపీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న దీక్షలకు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇక్కడే రాజధాని ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డిని తాను విమర్శిస్తే ఆయన పట్టించుకునేవారని, తనను చూస్తే ఆయన గౌరవించేవారని అన్నారు. కానీ, జగన్ మాత్రం అలా చేయడం లేదని, సూచనలను పట్టించుకోవట్లేదని అన్నారు. రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

తనపై ఒంటికాలుపై లేస్తున్నాడని, టైమ్‌ వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. తప్పులు చేసిన పోలీసు, అధికారి ఎప్పటికీ తప్పించుకోలేడని మరోసారి హెచ్చరించారు. రాజధానికి వెళ్లకుండా అడ్డుకుంటాడా.. ప్రజలందరూ ఏకమై పోరాటం చేస్తే జగన్‌ పులివెందుల పారిపోతాడని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు లేకుండా సీఎం ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టలేడన్నారు. దుర్మార్గ సీఎంను ఇంటికి పంపేందుకు ప్రజలు పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఆనాడు సీఎం పదవిలో ఉన్నప్పుడు హైదరాబాద్ ను తన కోసం అభివృద్ధి చెయ్యలేదన్నారు చంద్రబాబు.  తనకూ రోషం ఉంది కాబట్టే…. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక  హైదరాబాద్ కు ధీటుగా అమరావతిని తలపెట్టానన్నారు. సీఎం బాధ్యతలు నిర్వహిస్తూ.. పనిలో పడి కుటుంబం తో గడపలేదని, నాలుగేళ్లలో మనవడి తో రెండు గంటలు కూడా గడపలేదని చెప్పారు బాబు. తన సతీమణి సహకారం వల్లనే రాష్ట్రం కోసం ఎక్కువ కష్టపడ్డానని చెప్పారు.

అమరావతి లో ఒకే కులం అని అంటున్న  వైసీపీ సర్కార్ ఆరోపణల్లో నిజం లేదన్నారు బాబు. అనవసరంగా రాజధాని పై సామాజిక వర్గం నెపం వేస్తున్నారన్నారు. మనకు తిండి పెట్టేది ఉద్యోగం, అభివృద్ధి.. కులం, మతం కాదు. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులే ఇవ్వలేడు కానీ అమ్మ ఒడి ఇస్తాడా? ప్రజలు తెలిసో తెలియకో నెత్తిపై కుంపటి పెట్టుకున్నారు. నెత్తిన కుంపటి దించలేరు… తప్పించుకోలేరు అని అన్నారు చంద్రబాబు.