ఏపీలో ఇవ్వాళ చంద్రబాబు దీక్ష

ఏపీలో ఇవ్వాళ చంద్రబాబు దీక్ష

అక్రమార్జన కోసమే ఇసుక కొరత: చంద్రబాబు

అమరావతి, వెలుగు: అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు మాఫియాలుగా ఏర్పడి రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమార్జన కోసమే రాష్ర్టంలో ఇసుక కొరత సృష్టించారని మండిపడ్డారు. రాష్ర్టంలో వ్యాపారాలు చేయాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా జే (జగన్) ట్యాక్స్ కట్టాల్సి వస్తోందన్నారు. ఏపీలో నాలుగు నెలలుగా ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు గురువారం విజయవాడలోని ధర్నా చౌక్​లో ఉదయం 8 గంటలకు నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్షలో కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం గుంటూరులో టీడీపీ నేతలతో సమావేశమై మీడియాతో మాట్లాడారు. ఇసుక కొరత కారణంగా 35 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని, 50 మంది కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్ని జరిగినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు కరగడం లేదని మండిపడ్డారు. కార్మికుల కష్టం చూడలేకే వారికి మద్దతుగా తాను దీక్షకు దిగుతున్నానని చెప్పారు. కొత్త పాలసీని రద్దు చేసి.. ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించాలని, ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ ప్రభుత్వం తప్పుకోవడం ఏపీ అభివృద్ధికి ఆటంకం అన్నారు. దీక్షకు పార్టీ శ్రేణులు, కార్మికులు, ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

Chandrababu protest on sand shortage in AP at Dharna Chowk, Vijayawada