టీడీపీని వదిలిన నేతలకు చంద్రబాబు పిలుపు

టీడీపీని వదిలిన నేతలకు చంద్రబాబు పిలుపు
  • బుద్ధి ఉన్నోళ్లు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపేస్తామనరు
  • ఖమ్మంలో టీడీపీ ‘శంఖారావం’ సభ
  • తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తెస్తామని ధీమా 
  • అభివృద్ధితో లాభం పొందినోళ్లు ఆదరించాలి
  • ఖమ్మం ‘శంఖారావం’ సభలో మాట్లాడిన మాజీ సీఎం
  • టీడీపీని వదిలిన నేతలకు పార్టీ చీఫ్ చంద్రబాబు పిలుపు

ఖమ్మం, వెలుగు: తెలంగాణలో టీడీపీని విచిపోయిన నేతలంతా తిరిగి రావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధితో లాభం పొందినవారు పార్టీని ఆదరించాలని కోరారు. బుధవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన టీడీపీ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు తనకు లభించిన ఘనస్వాగతం చూస్తుంటే.. రాష్ట్రంలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు. టీడీపీ పాలనలో ఐటీ రంగం, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, టెక్నాలజీ రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ‘‘ఐటీ గైస్.. నన్ను గుర్తు పెట్టుకోవాలి. గూగుల్ అంకుల్ ని అడగండి నా విలువ ఏంటో, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో చెబుతుంది” అని చంద్రబాబు అన్నారు.  ఇక తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని చంద్రబాబు అన్నారు. ఫుడ్ సెక్యూరిటీ గురించి దేశం ఇప్పుడు మాట్లాడుతుంటే, నాలుగు దశాబ్దాల క్రితమే 2 రూపాయల కిలో బియ్యంతో ఫుడ్ సెక్యూరిటీ అవసరాన్ని ఆయన చాటిచెప్పారని తెలిపారు. రాజకీయాల్లో, స్థానిక సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లను ఎన్టీఆర్ పెడితే, తాను దాన్ని 33 శాతానికి పెంచానన్నారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కును 1985లోనే ఎన్టీఆర్ ఇచ్చారని, దీనిపై కేంద్రం ఇప్పుడు చట్టం తెచ్చిందన్నారు. ఎన్టీఆర్ దూరదృష్టిని 30 ఏండ్ల తర్వాత ఆచరించే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్ లో ఐటీ, ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, జినోమ్ వ్యాలీ.. ఇలా ప్రతి అభివృద్ధి వెనకా తన ఎఫర్ట్ ఎంతో ఉందని చంద్రబాబు చెప్పారు. 

ఖమ్మం అభివృద్ధి టీడీపీ ఘనతే

ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసింది టీడీపీయేనని చంద్రబాబు అన్నారు. ‘‘20 ఏళ్లకు ముందు భద్రాచలానికి వరదలు వచ్చేవి. 10 కిలోమీటర్లు, రూ.50 కోట్లు ఖర్చు పెట్టి కరకట్ట కడితే, ఈ మధ్య కూడా వరదలు రాకుండా అడ్డుకోగలిగాం. ఆరోజు కరకట్ట కట్టకపోతే భద్రాచలం పరిస్థితి ఎలా ఉండేది?” అన్ని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ, రోడ్లన్నీ టీడీపీ హయాంలోనివేనని చెప్పారు. దుమ్ముగూడెం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఖమ్మం మెడికల్ కాలేజీ టీడీపీ హయాంలోనే వచ్చాయన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు సహా ప్రాజెక్టులన్నీ తెచ్చింది టీడీపీయేనన్నారు.  

బుద్ధి ఉన్నోళ్లు.. కలిపేస్తామని అనరు 

‘‘కొంతమంది చేతగాని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపేస్తామని అంటున్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఇలా మాట్లాడరు” అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో విధ్వంసమే జరుగుతోందన్నారు. టీడీపీ హయాంలో వేసిన ఫౌండేషన్ వల్లే తెలంగాణలో హయ్యెస్ట్ పర్ క్యాపిటా వచ్చే పరిస్థితి నెలకొందని, ఏపీ మాత్రం ఇప్పుడు పాతాళానికి పడిపోయిందన్నారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడుందని అడిగేవాళ్లకు ఈ సభనే సమాధానమన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వానికి అండగా ఉంటానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.