ఏపీకి ఇది కష్టాల సంక్రాంతి: చంద్రబాబు

ఏపీకి ఇది కష్టాల సంక్రాంతి: చంద్రబాబు

ఏపీకి కష్టాల సంక్రాంతి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని విషయంలో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.బుధవారం నాడు మందడంలో రైతులు చేపట్టిన దీక్షకు చంద్రబాబు కుటుంబం, నందమూరి కుటుంబసభ్యులు దీక్షా శిబిరానికొచ్చి మద్దతు తెలిపారు.

‘ప్రతి ఏటా నారావారి పల్లె వెళ్లే వాళ్ళం మూడు రోజుల పాటు పండుగ చేసుకునే వాళ్ళం ఈ సారి పండగ చేసుకోవడం లేదు’ అని చంద్రబాబు ఈ దీక్షలో అన్నారు. అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదని..ఇది 5 కోట్ల మంది ఏపీ ప్రజల సమస్యన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలో శివరామకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారని…భూములు ఇచ్చిన వాళ్లలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. ఇక్కడ వరదలు వస్తాయని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని జగన్ అసత్యాలు చెప్పారని చంద్రబాబు మండిపడ్డారు.

రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం ఎడ్లపందాలకు వెళ్లారని..‘ఎడ్లపందాలకు వెళ్తాడు కానీ.. రైతులు చనిపోతే పరామర్శించలేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. మహిళలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాబు డిమాండ్ చేశారు. ‘హక్కుల కోసం పోరాడుతున్న  రైతులపై  వారిపై పోలీసులు జులుం చూపిస్తున్నారు. ఇక్కడ 144 సెక్షన్‌ ఎందుకు పెట్టారు?. రైతులు ఉగ్రవాదులా? తీవ్రవాదులా?’ అని బాబు ప్రశ్నించారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని, అందర్నీ బాధపెట్టి ఆయన పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రాజధాని కోసం ఎవరూ ప్రాణత్యాగాలు చేయొద్దని పోరాడి సాదిద్ధామని రైతులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఐదుకోట్ల ప్రజల జీవితాల్లో అంధకారం ఏర్పడిందన్నారు బాబు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. జగన్ ప్రభుత్వం సీఆర్డీఏ  చట్టాన్ని రద్దు చేసే యోచలో ఉందని రైతులు తెలుపగా.. ఏక పక్షం గా ఒక చట్టాన్ని రద్దు చేయడం కుదరదని  చంద్రబాబు అన్నారు.

Chandrababu's speech at farmer initiation in Mandadam