కొత్త కోచ్ను ప్రకటించిన కోల్కతా నైట్ రైడర్స్

కొత్త కోచ్ను ప్రకటించిన కోల్కతా నైట్ రైడర్స్

కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్గా చంద్రకాంత్ పండిట్ ఎంపికయ్యాడు. ఈ  మేరకు కేకేఆర్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది.  ఇన్నాళ్లు కేకేఆర్ హెడ్ కోచ్‌గా ఉన్న న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్.. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. కేకేఆర్ చంద్రకాంత్ ను ఎంచుకుంది. 

దేశవాళీ క్రికెట్లో మంచి పేరు..
దేశవాళీ క్రికెట్ లో చంద్రకాంత్ సక్సెస్ ఫుల్ కోచ్.  రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ తొలిసారి విజేతగా అవతరించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.  ముంబయి, విదర్భ జట్లకు రంజీ ట్రోఫీలు అందించారు. 2018, 2019లో విదర్భను వరుసగా విజేతగా నిలిపారు. ఈ నేపథ్యంలో జట్టుకు హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ సరైనవాడని కేకేఆర్‌ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్‌ పండిట్‌ను ఏరికోరి కేకేఆర్‌ కోచ్‌గా తీసుకొచ్చింది.

కేకేఆర్ కోచ్గా ఎంపికైనందుకు సంతోషం..
నైట్ రైడర్స్ టీమ్ కోచ్ గా ఎంపికైనందుకు సంతోషంగా ఉందని చంద్రకాంత్ పండిట్ తెలిపాడు.  కేకేఆర్‌ కుటుంబ సంస్కృతి, విజయవంతమైన సంప్రదాయాల గురించి  విన్నానని చెప్పాడు.  జట్టులో నాణ్యమైన సహాయ సిబ్బంది, ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు.  సానుకూల దృక్పథంతో తాను బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పుకొచ్చాడు. 

టీమిండియా ఆటగాడిగా చంద్రకాంత్..
చంద్రకాంత్‌ పండిట్‌ భారత్ తరపున 1986-92 వరకు ఆడాడు.  5 టెస్టులు, 36 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు.  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 48+ సగటుతో 8000 పైగా పరుగులు సాధించాడు. 

20222 ఐపీఎల్లో కేకేఆర్ విఫలం..
2012,2014లో కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత  మరోసారి టైటిల్ దక్కించుకోలేకపోయింది. అయితే 2021లో ఇయాన్‌ మోర్గాన్‌ కెప్టెన్సీలో ఫైనల్‌ చేరినా...చెన్నై చేతిలో ఓడిపోయింది.  2022 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో కోల్ కతా . కనీసం ప్లేఆఫ్‌ చేరకుండా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.