
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి.వీరముత్తువేల్(46) పెద్ద మనసు చాటుకున్నారు. అవార్డు రూపంలో వచ్చిన నగదు రూ.25 లక్షలను తాను గతంలో చదువుకున్న విద్యాలయాలకు విరాళంగా అందజేశారు. రాష్ట్రం తరఫున ఇస్రోకు విశేష సేవలు అందించిన సైంటిస్టులకు నగదు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. 8 మందిని గుర్తించి గాంధీ జయంతి రోజున ఒక్కొక్కరికి రూ.25 లక్షల బహుమతిని అందించింది. అందులో ఒకరైన వీరముత్తువేల్ తన నగదును వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు. ఆ డబ్బును తాను గతంలో చదివిన విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సంఘాలకు విరాళంగా ఇచ్చేశారు.
మనస్సాక్షి ఒప్పుకుంట లేదు
వీరముత్తువేల్ మాట్లాడుతూ..'చంద్రయాన్ విజ యం వ్యక్తిగత విజయం కాదు. సామూహిక విజ యం. కాబట్టి ఈ అవార్డును అందరితో పంచుకోవడమే కరెక్ట్ అనిపించింది. ఇంత భారీ ప్రైజ్ మనీని తీసుకోవడానికి నా మనస్సాక్షి ఒప్పుకుంట లేదు. నాకు వచ్చిన రూ.25 లక్షలను నన్ను సైంటిస్టుగా తీర్చిదిద్దిన విద్యాసంస్థలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. విల్లుపురంలోని ప్రభుత్వ రైల్వే పాఠశాలలో చదివాను. అయినప్పటికీ నాకు డబ్బు అంటే పెద్దగా ఇష్టం లేదు. దేశాభివృద్ధికి తోడ్పడే మంచి వాతావరణాన్ని ఇస్రో నాకు అందిస్తున్నది. అందుకే ఈ డబ్బును విరాళంగా ఇవ్వాలనే నా నిర్ణయం సంతృప్తికరంగా అనిపిస్తున్నది.' అని వివరించారు. తనకు ఒక సొంత ఇంటిని నిర్మించు కునేందుకు వీర్ముత్తువేల్ ఎస్‌బీఐలో రూ.72 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటికీ ఈఎంఐలు చెల్లిస్తున్నాడు. అయినా.. ఆయన తనకు వచ్చిన 25 లక్షల నగదును వాడుకోకపోవడం గమనార్హం. బెంగళూరుకు చెందిన మరో శాస్త్రవేత్తశంకరన్ కూడా తన 25 లక్షల ప్రైజ్ మనీని పూర్వ విద్యార్థుల సంఘానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.