సీఎం మార్పు అంతర్గత వ్యవహారం.. దళితుడ్ని సీఎం చేస్తే సంతోషమే

సీఎం మార్పు అంతర్గత వ్యవహారం.. దళితుడ్ని సీఎం చేస్తే సంతోషమే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

హైదరాబాద్: సీఎం మార్పు అనేది టీఆర్ఎస్ పార్టీ అంతరంగిక వ్యవహారం.. కొడుకును చూస్తాడో.. కూతుర్ని చేస్తాడో.. లేక అల్లుడినో.. బామ్మర్దినో ఎవరిని చేసినా అది వారిష్టం..  బీజేపీ దెబ్బలకు దళితుడ్ని సీఎం చేసినా సంతోషిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం మార్పు కోసం అనారోగ్యాన్ని సాకుగా చూపాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ కు వచ్చి బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేటీఆర్ ను సీఎం చేస్తే టీఆర్ఎస్ లో కొంత మంది బయటకొచ్చి వేరే పార్టీ పెడతామని చెబుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. మమ్మల్ని పల్లి బఠానీలు అమ్ముకునేవారు… కుక్కలు అని టీఆర్ఎస్ వారు అవహేళన చేస్తున్నారు…  దుబ్బాక ముందు ఇవే మాటలు మాట్లాడినందుకు ప్రజలు ఎలాంటి గుణపాఠం నేర్పారో అందరికీ తెలిసొచ్చిందన్నారు.  మూడు రోజులపాటు తాము నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన సదర్భంగా ఎక్కడకు వెళ్లినా సాదర స్వాగతం లభించడం బీజేపీ పట్ల ఆదరణకు నిదర్శనం అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారు సంతోషంగా ఎదురొచ్చి బాగా పనిచేస్తున్నారని అభినందిస్తున్నారని..  బీజేపీలో చేరతామని ముందుకొస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

అర్థరాత్రి నిర్ణయాలు.. ఆ తర్వాత యూ టర్న్‌లు

హడావుడిగా ఏ మాత్రం ఆలోచన లేకుండా అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకోవడం.. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే.. బీజేపీ బలపడుతోందన్న భయంతో తర్వాత యూటర్న్ లు తీసుకోవడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ చెత్త నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందిపడినా.. కష్టపడినా కనీసం క్షమాపణ చెప్పే మనసు కూడా లేదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో సీఎం సీటు అప్పగిస్తే.. ప్రగతి భవన్ లో ఉంటూ.. ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా.. దీనికోసమేనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకునేదని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ కు కరోనా వ్యాక్సిన్ కాదు.. ప్రజలే కమీషన్ల వ్యాక్సిన్ వేస్తారు

రాష్ట్రంలో పాలన అస్తవ్యవస్తంగా తయారైందని.. ఏ శాఖలో చూసినా.. ఎక్కడకు వెళ్లినా అవినీతి కంపుకొడుతోందన్నారు. కింద నుండి సీఎంవో స్థాయి వరకు అధికారులు కమీషన్లు వసూలు చేయడంలో మునిగి తేలుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసు స్టేషన్ కు వెళితే ఎస్.ఐ స్థాయి వారే సీఎం ఓకు కమీషన్లు ఇస్తున్నామని బాహాటంగానే చెబుతున్నారని విమర్శించారు. వరంగల్-కరీంనగర్ రోడ్డు ధ్వంసమైన విషయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తే టెండర్లే పిలవలేదు.. ఇంకో వైపు కాంట్రాక్టర్  ఎవరో తెలియదు.. పనులు మొదలుపెట్టారని.. టెండర్లు పిలవకుండా.. పని ఎవరికిచ్చిందో కన్ఫం చేయకుండా పనులు మొదలుపెడుతున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ అభివ

వృద్ధి పనులు చేపట్టడు… అధికారులతో కార్యక్రమాలు చేయించడు.. ఢిల్లీకి వెళ్లినా.. ఎవరిని కలిసినా.. చివరకు అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళ్లినా.. షెడ్యూల్ ప్రకటించడని.. దేశంలో షెడ్యూల్ ప్రకటించకుండా వెళ్లే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం నరకాసురుడిలాంటి కేసీఆర్ పాలనతో అంధకారంలోకి చిక్కుకుందన్నారు. ఆరేండ్లుగా సాధించింది ఏమీ లేదన్నారు. మంత్రులు.. ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ ఇవ్వని ఏకైక సీఎం.. ప్రజల్లోకి రాడు.. సచివాలయానికి రాడు.. పాలన విషయంలో కనీసం సమీక్షించడు.. అర్థరాత్రి నిర్ణయాలు తీసుకుంటాడు.. కొన్నిరోజుల్లోనే యూటర్న్ తీసుకుంటాడు.. ప్రజలు ఇబ్బందిపడితే కనీసం క్షమాపణ చెప్పడు.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేదలు ఇబ్బందిపడుతున్నారు.. సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు..ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లను ఉద్యమ సమయంలో పొగిడి.. ఉద్యమానికి ఎగదోసి.. పట్టించుకోవడం మానేశాడని.. కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ యధావిధిగా కొనసాగుతోందన్నారు. కరోనా సందర్భంగా.. ఒక్క స్కీమ్ అయినా పెట్టావా.. ప్రత్యేక నిధులు విడుదల చేశావా..? అనుచరులందరూ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి.. సీఎంఓకు వాటాలు ఇస్తున్నామని చెబుతున్నారు. కాంట్రాక్టర్లు.. బ్రోకర్ల చేతుల్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది.కాంట్రాక్టర్లు సిండికేట్ అవుతున్నారు. ఆన్ లైన్ టెండర్లు అయినా సిండికేట్ అవుతున్నారు’’ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. దేశమంతా తొందర్లోనే కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.. కేసీఆర్ కు మాత్రం ప్రజలే కమీషన్ వ్యాక్సిన్ ఇస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఇకనైనా ఫామ్ హౌస్‌లో జల్సాలు పక్కన పెట్టి ప్రజల గురించి పట్టించుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ లెక్క.. ఇతరుల నాశనం కోరుకునే రకం కాదు.. అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.