తెలంగాణలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​లో మార్పులు!

తెలంగాణలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​లో మార్పులు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మే , జూన్ నెలల్లో జరిగే ప్రవేశపరీక్షలపై లోక్​సభ ఎన్నికల ప్రభావం పడింది. ప్రధానంగా ఐసెట్ తో పాటు టీఎస్​ ఎప్ సెట్(ఎంసెట్) తేదీల్లో మార్పు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై మంగళవారం (ఈ నెల 19)సమీక్షించి, నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో మే13న పోలింగ్ ఉండగా, జూన్ 4 ఫలితాలు రిలీజ్ చేస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మే 9 నుంచి 12 వరకు ఎప్ సెట్ పరీక్షలు నిర్వహిస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇప్పటికే తేదీలు ప్రకటించింది. 

 పోలింగ్13వ తేదీన ఉండటంతో, ఎగ్జామ్..పోలింగ్ తేదీ మధ్య గ్యాప్ ఒక్కరోజు మాత్రమే ఉన్నది. దీంతో ఎగ్జామ్ నిర్వహణపై కొంత అయోమయం నెలకొన్నది. అవసరమైతే ఒక సెషన్ ముందుకు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే మే12న నిర్వహించే పరీక్షను.. ముందుకు అంటే 8వ తేదీకి మార్చే  యోచనలో ఉన్నారు. తక్కువ మంది ఉంటే.. ఇప్పటికే షెడ్యూల్​ అయిన తేదీల్లోనే అడ్జెస్ట్ చేయాలని భావిస్తున్నారు. మరోపక్క ఐసెట్ ఎగ్జామ్స్ జూన్ 4,5వ తేదీల్లో నిర్వహిస్తామని షెడ్యూల్​ విడుదల చేశారు. 

జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ ఉంది. దీంతో అనివార్యంగా 4వ తేదీ పరీక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నది. మరోపక్క లాసెట్ ఎగ్జామ్.. ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు అంటే జూన్ 3న ఉన్నది. ఈ పరీక్ష తేదీని మార్చాలా? లేదా? అనే దానిపై సమీక్షించనున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ప్రవేశపరీక్షల షెడ్యూల్ కు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అనే దానిపై మంగళవారం సెట్స్ అధికారులతో చర్చించి, సర్కారు దృష్టికి విషయాన్ని తీసుకుపోతామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ‘వెలుగు’ తో చెప్పారు. ఆ తర్వాతే పరీక్ష తేదీల మార్పుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.