కరోనా భయంతో పోలీసుల డ్యూటీలలో మార్పులు

కరోనా భయంతో పోలీసుల డ్యూటీలలో మార్పులు

కరోనా సెకండ్ వేవ్‌తో తెలంగాణ పోలీసు శాఖ అలర్ట్ అయింది. సిబ్బంది హెల్త్‌పై సర్వే చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న 80 వేల మంది సిబ్బంది పూర్తి ఆరోగ్య సమాచారం HRMSకు లింక్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు వ్యక్తిగత పనితీరు, ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా సిబ్బందికి డ్యూటీలు వేస్తున్నారు.

గతంలో పోలీసు శాఖలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచుతున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పోలీస్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. డిపార్ట్‌మెంట్‌లో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 

బీపీ, షుగర్, గుండె సంబందిత వ్యాధులతో పాటు ఇతర వ్యాధులకు సంబంధించి హెల్త్ రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ వారీగా వివరాలు సేకరిస్తున్నారు. హెల్త్ రిపోర్టు ఆధారంగా డ్యూటీలు ఇవ్వనున్నారు. ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటే లాంగ్ లీవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఆరోగ్యం నిలకడగా ఉంటే ఆఫీస్ డ్యూటీలు వేసే అవకాశం ఉంది. పూర్తిగా ఆరోగ్యం ఉన్నవారికి మాత్రం అవుట్ సైడ్ డ్యూటీ వేయనున్నారు.