టీఎస్‌‌పీఎస్సీలో 20 మంది డ్యూటీలు చేంజ్

టీఎస్‌‌పీఎస్సీలో 20 మంది డ్యూటీలు చేంజ్

హైదరాబాద్, వెలుగు:  పేపర్ల లీకేజీ నేపథ్యంలో  టీఎస్‌‌పీఎస్సీ ఆఫీసులో అధికారుల డ్యూటీలను చేంజ్ చేస్తున్నారు.కమిషన్-లో  ఏండ్ల నుంచి ఒకే విభాగంలో పనిచేస్తున్న 20మందిని ఇతర విభాగాలకు మార్చేశారు. ప్రధానంగా ఆఫీసులో కీలక విభాగాలైన కాన్ఫిడెన్షియల్, లీగల్, ఐటీ సెల్​లో  భారీగా మార్పులు చేశారు. అయితే, కాన్ఫిడెన్షియల్ విభాగానికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని కమిషన్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగుల వల్లే క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయనే భావనలో ఉన్న ఉన్నతాధికారులు.. ప్రత్యేక అధికారిని నియమించాలని సర్కారును కోరే అవకాశం ఉంది.  ఉన్న ఉద్యోగులంతా లీగల్, ఐటీ విభాగాలతో బిజీగా ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 

సిస్టమ్​లపై ఫోకస్ 

టీఎస్‌‌పీఎస్సీ విభాగాల్లో కీలకమైన సిస్టమ్​ల సెక్యూరిటీపై కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సిస్టమ్ లకు అన్నిరకాల ప్రొటెక్షన్ కల్పించేలా చర్యలు చేపడుతోంది. యూజర్ ఐడీలు, పాస్ వర్డ్​లు సెక్షన్ ఇన్ చార్జ్ కి తప్ప మరెవరికీ తెలియకుండా పకడ్బందీగా ఉంచనున్నారు.  సిబ్బందికి ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ వాడకంపై ఐటీ నిపుణులతో  ట్రైనింగ్ మొదలుపెట్టారు. సిస్టమ్స్ హ్యాకింగ్ కు గురికాకుండా సైబర్ సెక్యూరిటీ నిఘా మరింత పెంచారు.