కర్రెగుట్టల్లో వార్‌‌ క్యాంప్.. 700 ఎకరాలు కేటాయిస్తూ ఛత్తీస్‌‌గఢ్‌‌ సర్కార్‌‌ ఉత్తర్వులు

కర్రెగుట్టల్లో వార్‌‌ క్యాంప్.. 700 ఎకరాలు కేటాయిస్తూ ఛత్తీస్‌‌గఢ్‌‌ సర్కార్‌‌ ఉత్తర్వులు
  • జవాన్ల కోసం ప్రత్యేక ట్రైనింగ్‌‌ సెంటర్‌‌ ఏర్పాటు

భద్రాచలం, వెలుగు: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ బార్డర్‌లో ఉన్న బీజాపూర్‌ జిల్లాలోని కర్రెగుట్టల్లో వార్‌ఫైర్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన 700 ఎకరాల భూమిని కర్రెగుట్టలో కేటాయిస్తూ చత్తీస్‌గఢ్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని చత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ సైతం ధ్రువీకరించారు. కర్రెగుట్టల్లోకి బలగాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా 5.5 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్​మడ్​లో నిర్బంధం తీవ్రం కావడంతో మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఆశ్రయం పొందినట్లు కేంద్రానికి సమాచారం ఉంది. దీంతో కర్రెగుట్టలపై పర్మినెంట్​ మిలటరీ క్యాంపు ఏర్పాటు ద్వారా మావోయిస్టులను తుదముట్టించాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

గతంలోనే స్పెషల్‌‌ ఆపరేషన్‌‌..

ఈ ఏడాది ఏప్రిల్‌‌ 21 నుంచి మే 11 వరకు ఆపరేషన్‌‌ కర్రెగుట్ట పేరిట కేంద్ర హోంశాఖ, ఛత్తీస్‌‌గఢ్‌‌ ప్రభుత్వాలు సంయుక్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మీదుగా హెలికాప్టర్‌‌ ద్వారా కర్రెగుట్టల్లోకి, కాలినడకన పామునూరు గుట్టల్లోకి భద్రతాబలగాలు, ఆయుధ సామగ్రిని తరలించారు. ఇక్కడ జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే. 

విశాలమైన కొండలు, దట్టమైన అడవులతో ఉన్న ఈ కర్రెగుట్టలు ఇన్నాళ్లు మావోయిస్టులకు కంచుకోటలుగా నిలిచాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వార్​ఫైర్​ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 

జవాన్లకు స్పెషల్​ ట్రైనింగ్‌‌..

కర్రెగుట్టలు ప్రస్తుతం మావోయిస్టుల ఆధీనంలో ఉన్నాయని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే బస్తర్‌‌ ప్రాంతంలోని బీజాపూర్‌‌ జిల్లా ఊసూరు బ్లాక్‌‌లో ఉన్న ఈ గుట్టలను హస్తగతం చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ అధునాతన ట్రైనింగ్ సెంటర్‌‌ వార్‌‌ ఫైర్‌‌ స్కూల్‌‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ కేంద్రంలో జవాన్లకు గెరిల్లా యుద్ధతంత్రం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అడవుల్లో మావోయిస్టులతో తలపడేలా ట్రైనింగ్‌‌ ఇవ్వడం, అధునాతన ఆయుధాలను వినియోగించడంపై శిక్షణ 
ఇవ్వనున్నారు. 

మావోయిస్టులకు కష్టకాలం !

మావోయిస్ట్‌‌ పార్టీ ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చత్తీస్‌‌గఢ్‌‌ దండకారణ్యంలో 2025లో ఇప్పటివరకు జరిగిన ఎన్‌‌కౌంటర్లలో 210 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు సహా 13 మంది అగ్రనేతలు ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్‌‌ దేవూజీని పార్టీ చీఫ్‌‌గా, దండకారణ్యం స్పెషల్‌‌ జోనల్‌‌ కమిటీ కార్యదర్శి, మిలిటరీ చీఫ్‌‌గా సుక్మా జిల్లా పువ్వర్తికి చెందిన మడవి హిడ్మా నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో ఉన్న కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడం ద్వారా మావోయిస్టుల నియంత్రణకు కేంద్ర హోంశాఖ సరికొత్త వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తోంది.