కొట్టుకుపోయినవి పట్టించుకోవట్లే.. కొత్తవి కడ్తలే

కొట్టుకుపోయినవి పట్టించుకోవట్లే.. కొత్తవి కడ్తలే
  •     కట్టిన వాటిలో క్వాలిటీ లేక రెండేళ్లకే కొట్టుకుపోయిన వైనం
  •     వానలు పడుతుండడంతో పనులకు ఇబ్బందులు 

మహబూబాబాద్, వెలుగు : ఏళ్ల తరబడి నీటి నిల్వకు ఉపయోగపడాల్సిన చెక్‌‌‌‌ డ్యామ్‌‌‌‌లు నెలల వ్యవధిలోనే కొట్టుకుపోతున్నాయి. పనులు పరిశీలించకుండా ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించడం, కాంట్రాక్టర్‌‌‌‌ క్వాలిటీ లేకుండా పనులు చేయడంతో చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌లు కట్టిన రెండేళ్లకే పగిలిపోతున్నాయి. మరో వైపు కొత్త చెక్‌‌‌‌డ్యాంలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా వాటి పనులు ఇప్పటివరకు పూర్తి కావడం లేదు. 

38 మంజూరైతే 22 పూర్తి

మహబూబాబాద్‌‌‌‌ జిల్లా పాలేరు, ఆకేరు, మున్నేరు, పాకాల, వట్టి వాగులు ప్రవహిస్తున్నాయి. భూగర్భ జలాల పెంపులో భాగంగా ఈ వాగులపై 38 చెక్‌‌‌‌డ్యాంలు నిర్మించేందుకు 2019 – 20లో ప్రభుత్వం రూ. 117 కోట్లు కేటాయించింది. సంవత్సరంలోనే వీటి నిర్మాణ పనులు పూర్తి చేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు 22 చెక్‌‌‌‌డ్యాంలు మాత్రమే పూర్తికాగా, మిగిలిన 16 డ్యాంల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

తొర్రూరు మండల పరిధిలో 8 చోట్ల చెక్‌‌‌‌ డ్యాంలు నిర్మించాలని నిర్ణయిస్తే 6 మాత్రమే పూర్తయ్యాయి. చీకటాయపాలెం, కంఠాయపాలెం గ్రామాల్లో పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. కేసముద్రం, గూడూరు, మహబూబాబాద్‌‌‌‌ మండలాల్లో పలు చెక్‌‌‌‌డ్యాంల పనులు ప్రోగ్రెస్‌‌‌‌లో ఉన్నాయి.

రెండేళ్లకే కొట్టుకుపోయిన డ్యాంలు

చెక్‌‌‌‌డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్న టైంలో వాటి క్వాలిటీని ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారు. దీంతో కట్టిన రెండేళ్లకే చెక్‌‌‌‌డ్యాంలు కొట్టుకుపోయాయి. నెల్లికుదురు మండలం బ్రహ్మణ కొత్తపల్లి సమీపంలో ఆకేరు వాగుపై రూ. 76 లక్షలతో నాలుగేళ్ల క్రితం చెక్‌‌‌‌డ్యాం నిర్మించారు. క్వాలిటీ సరిగా లేకపోవడంతో పనులు పూర్తైన రెండేళ్లకే అది కొట్టుకుపోయింది. ఇక్కడ కొత్త చెక్‌‌‌‌ డ్యాం కట్టేందుకు ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

అలాగే మరిపెడ మండలం తానంచర్ల సమీపంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన చెక్‌‌‌‌డ్యాం కూడా రెండేళ్ల కింద కొట్టుకుపోయింది. ఇక్కడ కొత్త చెక్‌‌‌‌డ్యాం నిర్మించేందుకు రూ. 4 కోట్లతో ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌‌‌ పంపించినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో వాగులో నీరంతా వృథాగా పోతోంది. వర్షాకాలం ప్రారంభం కావడం వాగుల్లో నీటి ప్రవాహం ఉండడంతో చెక్‌‌‌‌డ్యాంల నిర్మాణ పనులకు ఇబ్బందులు 
ఎదురవుతున్నాయి.

క్వాలిటీ లేకుంటే చర్యలు  

చెక్‌‌‌‌డ్యాంల నిర్మాణంలో కాంట్రాక్టర్లు క్వాలిటీ పాటించాలి. జిల్లాలో ఇంకా 16 చోట్ల చెక్‌‌‌‌డ్యాంలు నిర్మించాల్సి ఉంది. వాగుల్లో వాటర్‌‌‌‌ ఫ్లో పెరగకముందే పనులు పూర్తి చేయాలి.

– వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌‌‌‌ ఎస్‌‌‌‌ఈ