
- పుణె జిల్లాలోని కల్వాడిలో ఘటన
- చిరుత దాడిలో మార్చి నుంచి ఇప్పటివరకు ఆరుగురి మృత్యువాత
పుణె:మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది.చిరుతపులి దాడిలో తొమ్మిదేండ్ల బాలుడు మృతిచెందాడు. పుణె జిల్లా జున్నార్ తాలూకాలోని కల్వాడి గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది. అహ్మద్ నగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రుద్ర ఫపలే అనే బాలుడు..తన తల్లి భాగ్యశ్రీతో కలిసి కల్వాడిలోని మేనమామ ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. చిరుతపులి వచ్చి అతన్ని పక్కనే ఉన్న చెరకు తోటలోకి లాక్కెళ్లింది.
బాలుడి ఏడుపు విన్న అతని తాత చెరకుతోటలోకి వెళ్లి చూడగా.. కొంత దూరంలో బాలుడు పొట్ట భాగంలో తీవ్ర గాయాలతో కనిపించాడు. వెంటనే అతన్ని ఇంటికి తీసుకురాగా.. ఉదయం 9 గంటల ప్రాంతంలో మరణించాడు. ఈ ప్రాంతంలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు చిరుతపులి దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు తెలిపారు. రుద్రపై చిరుతపులి దాడి చేయడంతో గ్రామస్తులు అటవీ శాఖకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ గార్డు ఘటనా స్థలానికి వెళ్లాడు.
దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు అతడిపై దాడి చేశారు. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత అతడు గ్రామానికి వచ్చినట్టు వారు తెలిపారు. కల్వాడి గ్రామ సర్పంచ్ తుషార్ వామన్ మాట్లాడుతూ.. గ్రామానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోని పింపాల్వాండిలో రెండు రోజుల క్రితం చిరుతపులి ఓ మహిళపై దాడి చేసిందని, ఆస్పత్రిలో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది తెలిపారు. ఇటీవల కూడా చిరుతపులి దాడి చేయడంతో అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తే.. ఘటనా స్థలానికి రాకుండా తమ కార్యాలయానికి వెళ్లమని చెప్పారని ఆయన ఫైర్ అయ్యారు.
చిరుత సంచారం నేపథ్యంలో అటవీ శాఖ నైట్ విజన్ డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడమే కాకుండా ట్రాప్ కేజ్‌లు, కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. కాగా, బాలుడి కుటుంబానికి అటవీ శాఖ నుంచి రూ.25 లక్షల పరిహారం అందజేయనున్నట్టు చెప్పారు.