హెటిరో ల్యాబ్స్ లో చిరుత.. 10 గంటలు ముప్పుతిప్పలు 

హెటిరో ల్యాబ్స్ లో చిరుత.. 10 గంటలు ముప్పుతిప్పలు 

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియాలోని హెటిరో ల్యాబ్స్​లో చిరుత దూరింది. శనివారం ఉదయం డ్యూటీకొచ్చిన ఉద్యోగులు ఫ్యాక్టరీలో చిరుతను గుర్తించి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చి  10 గంటల పాటు శ్రమించినా చిరుత దొరకలేదు. దీంతో  జూ పార్క్ సిబ్బందిని పిలిపించారు. వాళ్లు వచ్చి గన్​తో మత్తు మందిచ్చి పట్టుకొని జూ పార్క్‌‌కు తరలించారు.  

సంగారెడ్డి/జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జిన్నారం మండలం గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియాలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత దూరింది. ఉదయం డ్యూటీకి వెళ్లిన ఉద్యోగులు, కార్మికులు ఫ్యాక్టరీ హెచ్ బ్లాక్ లో చిరుత ఉన్నట్లు గుర్తించి భయంతో పరుగులు తీశారు. ఫ్యాక్టరీ గేట్లకు తాళాలు వేసి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఫ్యాక్టరీలో చిరుత సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల జనం ఆందోళనకు గురయ్యారు. హెటిరో ల్యాబ్స్ కు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది.. చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు. జిల్లా అటవీ అధికారి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో దాదాపు 10 గంటల పాటు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ కొనసాగింది. కానీ ఫలితం లేకపోవడంతో నెహ్రూ జూ పార్క్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫ్యాక్టరీకి చేరుకున్న జూ పార్క్ సిబ్బంది..చిరుత దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.  ముందస్తుగా బోను ఏర్పాటు చేసి, గన్‌‌‌‌‌‌‌‌ సాయంతో చిరుతకు మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత చిరుత మత్తులోకి జారుకోగానే పట్టుకొని బోనులో బంధించారు. దాన్ని జూ పార్క్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. చిరుత దొరకడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.