మా భూముల జోలికి రావొద్దు..సాగుచేసుకోనివ్వండి

మా భూముల జోలికి రావొద్దు..సాగుచేసుకోనివ్వండి

అమ్రాబాద్, వెలుగు: తమ భూముల జోలికి రావొద్దంటూ ఫారెస్ట్​ ఆఫీసర్లను చెంచు రైతులు అడ్డుకున్నారు. ఫారెస్ట్​ ఆఫీసర్లపై ఓ మహిళ పెట్రోల్​ పోయడంతో పాటు ఆత్మహత్యకు యత్నించింది. నాగర్​కర్నూల్ ​జిల్లా అమ్రాబాద్ ​మండలం మాచారం గ్రామంలో శుక్రవారం జరిగిందీ ఘటన. మాచారం శివారులోని చిన్నగుట్ట అటవీ ప్రాంతంలో కంపార్ట్‌‌‌‌మెంట్ నంబర్ 242లో 17 మంది తమ తండ్రుల కాలం నుంచి సుమారు 60 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు.అయితే రెండు నెలలుగా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారు. ‘‘ఇది ఫారెస్ట్ ల్యాండ్. ఇక్కడ మీరు 2005 తర్వాతే ఆక్రమించి సాగు చేస్తున్నారు” అని నోటీసులు జారీ చేశారు. శుక్రవారం భూముల్లో ప్లాంటేషన్ కోసం అధికారులు పనులు చేపట్టగా,  రైతులు అడ్డుకున్నారు. తమ భూముల జోలికి రావొద్దని, తమను సాగు చేసుకోనివ్వాలని వేడుకున్నారు. కానీ అధికారులు వినలేదు. దీంతో ఓ మహిళ అధికారులపై పెట్రోల్‌ చల్లింది. తర్వాత తానూ పోసుకుని కాల్చుకునేందుకు యత్నించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమెను అడ్డుకున్నారు. తమకు ఈ భూమే ఆధారమని, ఇది లేకపోతే తాము బతకలేమని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

దాడి చేసిన వారిపై కేసులు పెడ్తం

ఫారెస్ట్ ఆఫీసర్లపై ప్రజలు దాడులు చేయడం పద్ధతి కాదని, దాడికి పాల్పడిన వారిపై కేసులు పెడతామని అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజర్ అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. 2005 తర్వాతే మాచారంలో భూమిని సాగు చేశారన్నారు. వీరందరూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా.. కేవలం ఒక్కరికే అనుమతి లభించిందని, మిగిలినోళ్లకు అర్హత లేక దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయన్నారు. అక్రమంగా సాగు చేసుకోవడమే కాక, అధికారులను చంపుతామనడం నేరమన్నారు. అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

సాగు చేసుకోనివ్వండి: గువ్వల బాలరాజు

విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటన స్థలానికి బైక్‌పై చేరుకున్నారు. అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ఖరీఫ్ సీజన్​లో అధికారులు అడ్డుపడటం భావ్యం కాదన్నారు. డీఎఫ్‌‌‌‌వోతో ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. అధికారుల తీరు బాగాలేదని, అమాయక ప్రజలతో ఇలా వ్యవహరించడం సబబు కాదన్నారు. రైతులను వ్యవసాయం చేయనివ్వాలని చెప్పారు. పోడు భూముల సమస్యను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెంచులకు హామీ ఇచ్చారు. న్యాయం జరిగేలా చూస్తానన్నారు.