22 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నయట!

22 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నయట!
  • చెన్నై పోలీసుల జవాబుతో అవాక్కైన కోర్టు
  • పోలీసులను మందలిస్తూ స్మగ్లర్ల విడుదల

చెన్నై: భద్రంగా సీజ్ చేసి దాచిన గంజాయిని ఎలుకలు తిన్నాయట. అది కూడా ఒకటి, రెండూ కాదు ఏకంగా 22 కిలోలను స్వాహా చేశాయట. కేసు విచారణలో స్వయంగా పోలీసులు కోర్టుకు చెప్పిన జవాబిది. ఈ జవాబుతో న్యాయమూర్తితో పాటు కోర్టులో ఉన్న వాళ్లు అవాక్కయ్యారు. సాక్ష్యాధారాల విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటని పోలీసులకు న్యాయమూర్తి మందలించారు. సరైన ఆధారాలు చూపలేక పోవడంతో నిందితులను విడుదల చేశారు.

ఏం జరిగిందంటే..

2020లో చెన్నైలో ఇద్దరు స్మగ్లర్లను మెరీనా పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద తనిఖీ చేయగా 22 కిలోల గంజాయి లభించింది. దానిని స్వాధీనం చేసుకుని, స్మగ్లర్లు రాజగోపాల్, నాగేశ్వరరావులను అరెస్టు చేసి జైలుకు పంపారు. వారి వద్ద లభించిన గంజాయిని సీజ్ చేసి స్టేషన్​లోని స్టోర్ హౌస్ లో దాచారు. సుదీర్ఘంగా దర్యాప్తు జరిపి మూడేండ్ల తర్వాత.. ఇటీవలే ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 

కోర్టు మంగళవారం విచారణ చేపట్టగా.. నిందితుల నుంచి సేకరించిన గంజాయి ఇదేనంటూ పోలీసలు 50 గ్రాముల ప్యాకెట్​ను జడ్జి ముందు పెట్టారు. చార్జిషీట్​లో పేర్కొన్న మిగతా 21 కిలోల 950 గ్రాములు ఎక్కడని కోర్టు ప్రశ్నించగా.. మరో 50 గ్రాములను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. మిగిలిన 21.9 కిలోల గంజాయిని ఎలుకలు కాజేశాయని పోలీసులు బదులిచ్చారు. ఈ నిర్లక్ష్యపు సమాధానంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. సాక్ష్యాలు కాపాడటంలో పోలీసుల ఉదాసీన వైఖరిని ఎత్తిచూపుతూ మందలించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న 22 కిలోల గంజాయిని పోలీసులు చూపించలేకపోయారని చెబుతూ.. ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితులుగా ఆరోపించిన రాజగోపాల్, నాగేశ్వరరావులను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.