శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుఫాన్.. ప్రస్తుతం తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిత్వా కారణంగా సోమవారం ( డిసెంబర్ 01) తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలో కురిసిన వర్షాలకు సిటీలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి.
చెన్నైలో భారీ వర్షాలు కురస్తుండటంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సబ్‌వేలు మూసివేశారు అధికారులు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆరు గంటలుగా కురుస్తున్న వర్షానికి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో టీ నగర్ సహా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం లో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. చెంగల్పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అటు కొండంబాకం, అల్వార్ పేట సహా ఇతర ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు చెట్లు నేలకొరిగాయి.
చెన్నైలో వర్షాలపై సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలకు ఆదేశించారు. చెన్నై, తిరువల్లూర్, చెంగల్పట్టు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు మంజూరు చేశారు.
నైరుతి బంగాళఖాతం దిశగా సాగుతున్న దిత్వా ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి మీదుగా సాగుతోందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైకి 50 కిమీ దూరంలో ఉన్న దిత్వా.. మంగళవారం (డిసెంబర్ 02) నాటికి మరింత బలహీనపడనున్నట్లు అధికారులు తెలలిపారు. దీంతో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దిత్వా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
