
చెన్నైతో పంజాబ్, కోల్‌కతాతో రాజస్తాన్ ఢీ
దుబాయ్/అబుదాబి: ఐపీఎల్13 లీగ్ దశ చివరి అంకానికి వచ్చేసింది. మెగా టోర్నీ లాస్ట్ డబుల్ హెడర్‌లో మూడు జట్ల ఫ్యూచర్ తేలిపోనుంది. తలో పన్నెండు పాయింట్లతో5,6,7 స్థానాల్లో నిలిచిన పంజాబ్, రాజస్తాన్, కోల్‌కతా జట్లు లీగ్ దశలో తమ ఆఖరి ఆటకు రెడీ అయ్యాయి. ఆదివారం జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుండగా… రాత్రి జరిగే పోరులో రాజస్తాన్, కోల్‌కతా అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదు విక్టరీల తర్వాత రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్‌కు ఇది చావోరేవో లాంటి సిచ్యువేషన్. మిగతా రెండింటితో పోలిస్తే కాస్త మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న లోకేశ్ రాహుల్ సేన తమ లాస్ట్ మ్యాచ్‌లో గెలిచి రేసులో నిలవాలని చూస్తోంది.
తమ ఐపీఎల్ జర్నీలో ఫస్ట్ టైమ్ లీగ్ దశలోనే నిష్క్రమిస్తున్న చెన్నై ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు కాపాడుకోవాలని ఆశిస్తోంది. అందరికంటే ముందే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగిన ధోనీసేన గత రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు, కోల్‌కతాను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే ఊపుతో పంజాబ్‌పై పైచేయి సాధించి విజయంతో లీగ్‌ను ముగించాలని చూస్తోంది. దాంతో, ఈ పోరులో కింగ్స్ ఎలెవన్‌కు సవాల్ ఎదురవనుంది. రాయల్స్‌పై భారీ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన రాహుల్ అండ్ కో.. బౌలింగ్‌లో మెరుగైతేనే ముందుకెళ్లగలదు. అదే టైమ్‌లో రన్‌రేట్ పెంచుకోవడంపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు రాజస్తాన్–కోల్‌కతా మధ్య పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. పటిష్ట ముంబైతో పాటు పంజాబ్‌ను చిత్తు చేసి జోరు మీదున్న రాయల్స్‌కే కాస్త మొగ్గు కనిపిస్తోంది. అదే ఊపులో కోల్‌కతా పని పట్టి 14 పాయింట్లు ఖాతాలో వేసుకోవాలని చూస్తోందా జట్టు. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడడంతో పాటు తక్కువ రన్‌రేట్‌తో ఉన్న కోల్‌కతా ఏం చేస్తుందో చూడాలి.