పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి

పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి
  • సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్​రెడ్డికి షాక్ 
  • సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల మీటింగ్​లో వాడివేడి చర్చ 

హైదరాబాద్, వెలుగు: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్​ ఎమ్మెల్సీ సెగ్మెంట్​లో తమ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి పేరును  పీఆర్టీయూటీఎస్​ అధికారికంగా ప్రకటించింది. దీంతో సిట్టింగ్ టీచర్ ఎమ్మెల్సీ జనార్దన్​రెడ్డికి షాక్​ ఇచ్చినట్లయింది. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం ఆదివారం హైదరాబాద్​లో వాడివేడిగా జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై  పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్​రెడ్డి, కమలాకర్​రావు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల అభిప్రాయాలు సేకరించారు.

సెగ్మెంట్​ పరిధిలోని అధ్యక్ష, కార్యదర్శులు.. జనార్దన్​రెడ్డికి మద్దతివ్వగా, మిగిలిన జిల్లాలు, ప్రస్తుతమున్న ఆ సంఘం కోర్ కమిటీ సభ్యులు చెన్నకేశవ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే సంఘం ఎమ్మెల్సీగా ఉంటూ పీఆర్టీయూ నాయకులకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించారో వివరణ ఇవ్వాలని  స్టేట్ లీడర్లు ఆయన్ను నిలదీసినట్లు సమాచారం. దీంతో జనార్దన్​రెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా చెన్నకేశవరెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, టీటీజేఏసీ గా చైర్మన్​గా పనిచేశారు. 2017–18 కాలంలో పీఆర్టీయూ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఈ సమావేశంలో కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పీఎల్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.