100 పడకల దవాఖాన రెడీ..చెన్నూర్ లో రూ.32 కోట్లతో నిర్మాణం

100 పడకల దవాఖాన రెడీ..చెన్నూర్ లో రూ.32 కోట్లతో నిర్మాణం
  •     అందుబాటులో 18 మంది డాక్టర్లు, 23 మంది నర్సింగ్ స్టాఫ్
  •     నెలాఖరులోగా ప్రారంభిస్తామన్న మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో 100 పడకల దవాఖాన రెడీ అయింది. రూ.32 కోట్లతో ఆధునిక వసతులతో హాస్పిటల్  బిల్డింగ్​ను నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జి.వివేక్ వెంకటస్వామి చొరవతో పనులు వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న హాస్పిటల్ ను ఈ నెలాఖరులోగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఓపెన్  కాగానే ప్రస్తుతం పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని ఎంసీహెచ్ గా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. 

అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు..

చెన్నూర్, ఆస్నాద్  రోడ్ లో నిర్మించిన 100 పడకల హాస్పిటల్ లో ఆధునిక వైద్య సేవలు అందించనున్నారు. వైద్య పరీక్షల కోసం ల్యాబ్, ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్  సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఆపరేషన్  థియేటర్  కూడా రెడీ అయింది. సిటీ స్కాన్  మెషీన్  రావాల్సి ఉంది. ప్రస్తుతం రేడియాలజిస్ట్, ముగ్గురు అనస్థీషియా డాక్టర్లు, మరో ముగ్గురు పీడియాట్రిక్, ఇద్దరు ఆర్థో, ఒకరు ఆప్తాల్మజీ, జనరల్  మెడిసిన్  ఒకరు, జనరల్  సర్జన్  ఒకరు, మరో ఇద్దరు గైనకాలజిస్టులతో కలిపి మొత్తం 18 మంది డాక్టర్లు ఉన్నారు. మరో ఐదుగురు డాక్టర్లు రానున్నారు. ఇప్పటికే ఆయా విభాగాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 23 మంది నర్సింగ్  స్టాఫ్ తో పాటు నలుగురు ల్యాబ్  టెక్నీషియన్లు, 41 మంది అవుట్  సోర్సింగ్  శానిటేషన్  వర్కర్స్  కూడా అందుబాటులో ఉన్నారు. 

తీరనున్న కష్టాలు.. 

100 బెడ్స్  హాస్పిటల్  ఏర్పాటుతో చెన్నూర్  నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరనున్నాయి. చెన్నూర్, జైపూర్, భీమారం, కోటపల్లి, వేమనపల్లి మండలాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు అందుబాటులో ఉండడంతో ఇక మీదట మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్  వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అన్నిరకాల వైద్య సేవలు ఒకే దగ్గర అందుబాటులోకి రావడం పేదలకు ఎంతో ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు.