- చికిత్స పొందుతున్న మరో 11 మంది
హైదరాబాద్ సిటీ, వెలుగు: మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు కోలుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడిన 14 మందిని చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి దవాఖానలో అడ్మిట్ చేశారు. తర్వాత మరో ముగ్గురు కూడా చేరారు. వీరిలో మజీద్, సాయిశ్రీతో పాటు మరో ముగ్గురిని డిశ్చార్జి చేయగా.. నందిని అనే యువతితో పాటు ఓ ప్రైవేట్టీచర్టి.జయసుధను నిమ్స్‌కు రెఫర్చేశారు.
మిగతా వారికి ట్రీట్ మెంట్ కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే బాధితుల్లో ఎవరిని కదిలించినా ఘటనను తలుచుకొని కన్నీళ్లు పెడుతున్నారు. భయానక దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఉలిక్కి పడుతున్నారు. తమ ఆర్తనాదాలు విని స్థానికులు, పోలీసులు చేసిన సాయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
బస్సెక్కిన 10 నిమిషాలకే..
నేను చిట్టెంపల్లి గేటు వద్ద బస్సెక్కాను. 10 నిమిషాల్లోనే ఇంద్రారెడ్డి నగర్ దాటగానే ప్రమాదం జరిగిపోయింది. కండక్టర్ పక్కనే నిలబడడంతో గాయాలతో బయటపడ్డాను. లేదంటే నేనూ చనిపోయేవాడినే.
–నర్సింహులు, అంతారం
బస్సును కిందకు తిప్పినా..
టిప్పర్ బస్సు వైపు దూసుకొస్తున్న విషయం గమనించి డ్రైవర్ వెంటనే ఎడమ వైపు కిందకు తిప్పారు. అయినప్పటికీ ప్రమాదం తప్పలేదు..నా తలకు 18 కుట్లు పడ్డయి. నేను16 ఏండ్లుగా డ్యూటీ చేస్తున్న.. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు.
–రాధ, కండక్టర్ , తాండూరు
కంకర కప్పేసింది
నేను తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్నా. ప్రమాద సమయంలో ఫోన్ మాట్లాడుతున్న. క్షణాల్లో టిప్పర్ బస్సును ఢీకొట్టింది. బస్సులోని ప్రయాణికులను కంకర కప్పేసింది. చాలామంది ఊపిరాడకనే చనిపోయారు. నేను మాత్రం బతికి బయటపడ్డా..
–అఖిల్ ఖాన్, వికారాబాద్
గంట సేపు కంకరలోనే ఉన్నా..
కంకరలోనే గంట సేపు నరకం అనుభవించా. నా పక్కన ఉన్న ఇద్దరిని బయటికి నెట్టేలోపే కంకర నన్ను ముంచేసింది. బతుకుతా అనుకోలే. నా ఇద్దరు పిల్లలు యాదికొచ్చిన్రు..దేవుని మీదనే భారం వేసిన..ఆ ఘటనను తలుచుకుంటే భయమేస్తాంది..
–బస్వారాజ్ , యాలల
