
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. వికారాబాద్ లో ఇవాళ కొండా చేపట్టిన దీక్షను భగ్నం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధికారం చేపట్టినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని…వివక్షకు గురవుతోందన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా కరువు తాండవిస్తోందన్నారు. హామీలు ఇచ్చుడే కానీ చేసిందేమీ లేదని TRS పార్టీపై ఆరోపణలు గుప్పించారు.
రంగారెడ్డి జిల్లాకు జరిగిన అన్యాయంపై వికారాబాద్‌లో ఎంపీ విశ్వేశ్వర రెడ్డి దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని నష్టం జరుగుతోందని.. గత అయిదేళ్లలో జిల్లాకు ఒక్క కొత్త ఉద్యోగం రాలేదని, ఒక్క ఎకరానికి నీరు రాలేదని విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి దీక్షలకు పర్మిషన్ లేదని పోలీసులు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చెప్పారు. అయినా ఆయన తన దీక్షను విరమించేందుకు నిరాకరించడంతో అరెస్ట్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు TRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా విశ్వేశ్వర రెడ్డి.