V6 News

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
  • 6 తులాల బంగారం, 61 మొబైల్ ఫోన్​లు స్వాధీనం
  • కారు, రెండు బైక్​లు కూడా సీజ్

చేవెళ్ల, వెలుగు: రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్​లు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను చేవెళ్ల క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీల కోసం ఈ ముఠా మైనర్లను కూడా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఏసీపీ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 17న ఫరూక్ నగర్ మండలానికి చెందిన రైతు వెంకటయ్య చేవెళ్ల బస్టాండ్​లో షాద్​నగర్ బస్సు ఎక్కుతుండగా, అతని జేబులోని 6 తులాల బంగారాన్ని దుండగులు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక క్రైమ్ టీమ్​ను రంగంలోకి దింపారు. టెక్నికల్ ఆధారాలతో మేడ్చల్ జిల్లాలోని ప్రతాపసింగారం వద్ద నిందితులు బేతంపల్లి మేరీ, దేవరకొండ రేణుక, పాలేరు సుష్మిత, ఆకుల గంగయ్యతో పాటు ఇద్దరు మైనర్లను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు.

అయితే ప్రధాన నిందితులు రాజశేఖర్, నాగేంద్ర, చందు, చరణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ. 12.50 లక్షల విలువైన 6 తులాల బంగారు ఆభరణాలు, 61 మొబైల్ ఫోన్లు, ఒక ట్యాబ్​తో పాటు.. నేరాలకు ఉపయోగించిన సుమారు రూ. 5 లక్షల విలువైన కారు, బుల్లెట్, జూపిటర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కర్నాటక, బెంగళూరు, సికింద్రాబాద్ పరిధిలోనూ నేరాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు.