- ఓటర్ ఐడీ, ఆధార్, సీ పెక్ డేటాతో పెన్షన్లను స్ట్రీమ్‌లైన్ చేయాలి: సీఎం రేవంత్
- కొత్త పింఛన్ల జారీలో ఒంటరి మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలి
- ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఒకటో తారీఖునే వేతనాలు.. ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకోం
- పంచాయతీ సిబ్బంది జీతాల కోసం ప్రతి నెలా
- రూ. 50 కోట్లు చెల్లిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చి, ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ మొత్తాన్ని జమ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా సాగుతున్న విధానానికి స్వస్తి పలికి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, సీపెక్ డేటా ఆధారంగా పెన్షన్ల ప్రక్రియను పూర్తిగా స్ట్రీమ్‌లైన్ చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగాలని, కొత్తగా మంజూరు చేసే పెన్షన్ల జాబితాలో ఒంటరి మహిళల దరఖాస్తులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
పెన్షన్ల పంపిణీలో సాంకేతికతను జోడించడం ద్వారా వృద్ధులు, వంచిత లబ్ధిదారులకు వేగంగా, సమయానికి సహాయం అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బంది సంక్షేమంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ అధికారులకు నెల నెలా సమయానికి జీతాలు అందినట్లుగానే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ప్రతినెలా మొదటి తారీఖునే వేతనాలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందాలని, ఇందులో ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. ఈ సిబ్బంది జీతాలు క్రమం తప్పకుండా చెల్లించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ. 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 70(3) సవరణ
గ్రామ పంచాయతీలపై గత ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగిస్తూ.. స్థానిక సంస్థల స్వతంత్రతను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 లోని సెక్షన్ 70(3) ప్రతిపాదిత సవరణ ప్రకారం.. గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా సవరణ చేయాలని ఆదేశించారు.
గతంలో ఈ నిధులను ట్రెజరీల్లో పెట్టడం వల్ల స్థానిక అవసరాలకు తక్షణమే ఖర్చు చేసుకోలేక పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని, ఇకపై బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించవచ్చని వివరించారు. ఈ నిబంధనల సవరణతో పాటు జీతాల నిధుల విడుదల ప్రక్రియను పంచాయతీరాజ్, ఆర్థిక శాఖలు సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్ రంజన్, వికాస్ రాజ్, దాన కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
