చత్తీస్​గఢ్​ రైతుల ఐడియా.. రెండు చేతుల సంపాదన

చత్తీస్​గఢ్​ రైతుల ఐడియా.. రెండు చేతుల సంపాదన
  • మహాసమంద్​ ఫారెస్ట్​ అధికారుల సాయంతో పెంపకం
  • తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలతో ఎరువు తయారీ
  • రెండు చేతులా సంపాదిస్తున్న రైతులు
  • పంట వ్యర్థాలను కాల్చని రైతులకు పంజాబ్​ సర్కార్​ ప్రోత్సాహకాలు

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు ఢిల్లీ కాలుష్యానికీ ఎన్నో కారణాలున్నాయి. అందులో ఒకటి పంట వ్యర్థాలను తగులబెట్టడం. ఢిల్లీకి పొగబెడుతున్న కారణాల్లో దాని వాటానే సగం వరకు ఉంటుందన్నా ఆశ్చర్యం లేదు. అంతగా పంజాబ్​, హర్యానా రైతులు పంట చెత్తను తగులబెట్టేస్తున్నారు. అయితే, పంట చెత్తను కాల్చకుండా రెండు చేతులా సంపాదించే మంచి మార్గాన్ని చత్తీస్​గఢ్​ రైతులు చూపించారు. ఇటు రెండు చేతులా సంపాదనకు అటు పర్యావరణానికి మేలు చేసేలా ఆ పంటచెత్తలోనే  పుట్టగొడుగులను పండిస్తున్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం మానేసి దాని నుంచే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో, వాతావరణాన్ని ఎలా కాపాడుకోవాలో దారి చూపిస్తున్నారు. పంట కోశాక మిగిలిపోయిన గడ్డి, ఇతర వ్యర్థాలతో పుట్టగొడుగులను పండిస్తున్నారు. వరి వేస్టేజ్​లోని స్టార్చ్​తో పుట్టగొడుగులను పండించడంపై మహాసమంద్​ ఫారెస్ట్​ అధికారులు రైతులకు శిక్షణ ఇచ్చారు. అంతేగాకుండా, పుట్టగొడుగులు పండాక మిగిలిపోయిన వ్యర్థాలతో వెర్మి కంపోస్ట్​ను తయారు చేస్తున్నారు. ఆ కంపోస్ట్​ ఎరువులను పంట పొలాల్లో వేసి సహజంగా నేల సారాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇటు రైతులు, అటు పర్యావరణ కార్యకర్తలు మెచ్చుకుంటున్నారు. తమకు రెండు చేతులా ఆదాయం వచ్చేలా మంచి కార్యక్రమం చేస్తున్నారని రైతులు అంటుంటే, ప్రకృతికి మేలు చేస్తున్నారని స్వచ్ఛంద కార్యకర్తలు కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలోకి ఇప్పుడు మహిళా స్వయం సహాయక సంఘాలను తీసుకొచ్చారు మహాసమంద్​ ఫారెస్ట్​ అధికారులు. అంతేగాకుండా ఆసక్తి చూపిస్తున్న వారికీ అవకాశం కల్పిస్తున్నారు.

వ్యర్థాలను కాల్చనోళ్లకు 19 కోట్ల పరిహారం

పంటచెత్తను కాల్చని రైతులకు పంజాబ్​ ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోంది. అలా ఇప్పటిదాకా 29,343 మంది చిన్న సన్నకారు రైతులకు 19 కోట్ల 9 లక్షల రూపాయల ప్రోత్సాహకాలను అందించినట్టు పంజాబ్​ ప్రభుత్వం తెలిపింది. వరి పంట కోయగా మిగిలిపోయిన కొయ్యకాలు (భూమిలో వేర్లతో పాటు ఉండే వ్యర్థాలు), కోసిన గడ్డిని తగులబెట్టని వాళ్లకు ఎకరాకు ₹2,500 చొప్పున పరిహారం ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో, కొందరు రైతులు వాటిని తగులబెట్టడం ఆపేశారు. ఈ లెక్కన పంట వ్యర్థాలను కాల్చని రైతులకు ఒక్కొక్కరికి సగటున ₹6,500 చెల్లించింది పంజాబ్​ సర్కార్​. ఈ పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపించినట్టు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కహాన్​ సింగ్​ పన్ను తెలిపారు. ఫీల్డ్​ ఆఫీసర్లు ఇచ్చిన లిస్టు ప్రకారం రైతులకు పరిహారం ఇచ్చామన్నారు. ఇప్పటిదాకా పరిహారం కోసం 85 వేల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులకు నవంబర్​ 30 చివరి తేదీ అని చెప్పారు. ఇంకా పెద్ద మొత్తంలో పరిహారం చెల్లిస్తామన్నారు. అయితే, అక్కడి రైతు సంఘాలు మాత్రం, ఇదంతా పచ్చి అబద్ధమని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చెప్పినట్టు తమకు ఒక్క పైసా రాలేదని అంటున్నాయి. తప్పుడు లెక్కలు చెబుతూ సుప్రీం కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించాయి.

బాబోయ్​.. మాకు ఊపిరాడట్లేదు

పంట చెత్తను కాల్చకుండా ఉండేందుకు పంజాబ్​ ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తున్నా, కొన్ని చోట్ల అది కొనసాగుతూనే ఉంది. దీంతో పంజాబ్​ జనాలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని ఊళ్ల జనాలు విషపు పొగను పీల్చి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమకు ఊపిరి కూడా ఆడడం లేదంటూ కొన్ని ఊళ్ల జనాలు అధికారులకు ఫిర్యాదు చేశారు. పదౌంజియాన్​, కన్సల్​ తదితర గ్రామాల్లోని జనాలు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. రైతులు పంట వ్యర్థాలను తగులబెడుతుండడంతో పొద్దెక్కాక కూడా సూర్యుడి వెలుతురు రావడం లేదని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ పొగ ధాటికి రోడ్డు కూడా కనిపించక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. కాగా, అక్టోబర్​ 1 నుంచి నవంబర్​ 3 దాకా పంజాబ్​లో 25,366 పంట వ్యర్థాలను తగులబెట్టిన ఘటనలు నమోదైనట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పక్క రాష్ట్రం హర్యానాలో 4,414 ఘటనలు జరిగాయి.