
- గవర్నమెంటుకు అనుకూలంగా వ్యవహరించొద్దు
- నిష్పక్షపాతంగాఎన్నికల విధులు నిర్వర్తించాలె
- అలా అయితే మేం కఠిన చర్యలు తీసుకోక తప్పదు
హైదరాబాద్: రాష్ట్ర స్థాయి అధికారులను రాజకీయ పార్టీలు నమ్మడం లేదని, వారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అధికారులు అన్ని పార్టీలనూ సమానంగా చూడాలని సూచించారు. తాము గతంలో మాదిరిగా కాకుండా ప్రతి అంశాన్నీ నిషితంగా పరిశీలిస్తామని చెప్పారు. పక్షపాతంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
22 లక్షల ఓట్లు తొలగించాం
తెలంగాణలో ఈ ఏడాది 22 లక్షల ఓట్లను తొలగించామని, 8 లక్షల మంది కొత్త ఓటర్లు జాయిన్ అయ్యారని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థలతో విడివిడిగా భేటీ అయ్యామన్నారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరాయని చెప్పారు. తెలంగాణాలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 ఉన్నారని తెలిపారు. పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించామని, 2022–20లో 22 లక్షల ఓట్లను తొలగించామని, ఫామ్ అందిన తర్వాతే వాటిని రిమూవ్ చేశామని అన్నారు. కొత్తగా 8.11 లక్షల మంది ఓటర్లుగా చేరారని అన్నారు.
రాష్ట్రంలో మహిళలు, పురుష ఓటర్లు సమానంగా ఉన్నారని చెప్పారు. 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. 80 ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43లక్షలు ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇష్యూ ఉన్నదని, యువత - మహిళల ఓట్లను పెంచేందుకు కృషి చేశామని వివరించారు. రాష్ట్రంలో 35,356 మొత్తం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా అక్రమ నగదు, మద్యాన్ని కట్టడి చేయాలని ఎక్కువ మంది నాయకులు కోరారన్నారు. పట్టణ ప్రాంతాల్లో మైక్రో ఆబ్జర్వర్లను పెట్టాలని కోరారని చెప్పారు. మొదటిసారి తెలంగాణలో వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేయడానికి ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని, అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే సీ విజిల్ యాప్‌లో ఫొటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సువిధ పోర్టల్ ప్రతి అభ్యర్థి డౌన్లోడ్ చేసుకొని సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్‌లు 89 ఏర్పాటు చేస్తామని వివరించారు. మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నగదు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆన్లైన్‌లో నగదు బదిలీలపైనా ఈసీ నిఘా ఉంటుందన్నారు. - సోషల్ మీడియాలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు.