రిటర్నింగ్ ఆఫీసర్లు పక్షపాతం చూపిస్తున్రు

రిటర్నింగ్ ఆఫీసర్లు పక్షపాతం చూపిస్తున్రు
  • రూలింగ్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని సీఈఓకు ఫిర్యాదులు  
  • 4,798 నామినేషన్లలో 606  రిజెక్ట్​ 
  • ఒక్కో పార్టీకి ఒక్కోలా వ్యవహరించారని ఆరోపణలు 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల విషయంలో కొందరు రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ)లు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)కి ఫిర్యాదులు అందాయి. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా పలువురు స్వతంత్ర అభ్యర్థులు, బీఎస్పీకి చెందిన 8 మంది క్యాండిడేట్ల నామినేషన్లను తిరస్కరించడంపై వారు కంప్లయింట్ చేశారు.

చిన్న చిన్న విషయాలను సరిచేయాల్సిందిపోయి.. కావాలనే నామినేషన్లను రిజెక్ట్ చేశారని వారు ఆరోపించారు. అధికార పార్టీకి ఒకలా.. మిగతా పార్టీలు, అభ్యర్థుల విషయంలో ఇంకోలా ఆర్ఓలు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల్లో ఆరోపించారు. కొన్ని టెక్నికల్ అంశాలు, చిన్న చిన్న తప్పులను అప్పటికప్పుడు సరిచేయాల్సి ఉండగా.. అధికార పార్టీ అభ్యర్థులకు అప్రూవల్ ఇచ్చి, మిగతా వారి నామినేషన్లు మాత్రం రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,798 నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో 606 నామినేషన్లను ఆర్ఓలు తిరస్కరించారు. మొత్తం 2,898 మంది నామినేషన్లను ఆమోదించారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఒక్కో అభ్యర్థి రెండు నియోజకవర్గాలకు మించి పోటీ చేయకూడదు. అలాగే నాలుగు సెట్లకు మించి నామినేషన్లు దాఖలు చేయరాదు. కానీ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయడంతో వారి నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి.   

పత్రాలు లేకున్నా అప్రూవ్ చేశారు: ప్రేమేందర్ రెడ్డి

గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి సరైన పత్రాలు సమర్పించకున్నా నామినేషన్ ను ఆర్ఓ అప్రూవల్ చేశారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఈసీ, సుప్రీంకోర్టు నిబంధనలను ఆర్ఓలు పాటించడం లేదన్నారు. ఈ మేరకు సీఈఓ వికాస్ రాజ్ ను కలిసి కంప్లయింట్ చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఆర్ఓలు వెనుకేసుకొస్తున్నారని అన్నారు. ఆఫీసర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్నీ కలుస్తామన్నారు. పోలీసులు సైతం బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.   

పక్షపాతం చూపుతున్నరు: నవీన్ యాదవ్  

జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేవని స్వతంత్ర అభ్యర్థి- నవీన్ యాదవ్ తెలిపారు. తమ అభ్యర్థనపై బీజేపీ అభ్యర్థికి నోటీస్ ఇచ్చారని, దాంతో ఆ అభ్యర్థి పూర్తి వివరాలు సమర్పించారన్నారు. అయితే, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నా నోటీసులు కూడా ఇవ్వకుండానే అప్రూవల్ చేశారని తెలిపారు. ఆర్ఓలు అధికార పార్టీకి వత్తాసు పలకడంపై సీఈఓకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సీఈఓ ఆఫీస్ చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తామన్నారు.